Andhra Pradesh: ఏపీలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీకి ఎన్ని ఓట్లు వస్తాయో చెప్పిన వీడీపీ అసోసియేట్స్

  • టీడీపీకి పెరిగిన ఓటింగ్ షేర్
  • జనసేనకు తగ్గిన ఓటు శాతం
  • అధికార వైసీపీకి సరైన విపక్షం టీడీపీయేనంటున్న సర్వే
VDP Associates survey on AP Politics

జాతీయ స్థాయి సామాజిక రీసెర్చ్ సంస్థ వీడీపీ అసోసియేట్స్ తాజా సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ప్రధాన పార్టీల్లో దేనికెన్ని ఓట్లు వస్తాయో వీడీపీ ఓ సర్వే నిర్వహించింది. అధికార వైసీపీకి 52.97 శాతం, టీడీపీకి 40.06 శాతం, జనసేనకు 3.56 శాతం, బీజేపీకి 2.2 శాతం, కాంగ్రెస్ 0.6 శాతం, ఇతరులు 0.61 ఓట్లు దక్కించుకుంటారని ఈ సర్వేలో వెల్లడైంది.

అదే సమయంలో వైసీపీ, టీడీపీ గత ఎన్నికల కంటే ఈసారి అధిక ఓట్లను పొందుతాయని వీడీపీ పేర్కొంది. 2019 ఎన్నికల్లో వైసీపీకి 49.95 శాతం ఓట్లు రాగా, ఇప్పుడు 52.97 శాతం వస్తాయని వివరించింది. టీడీపీ గత ఎన్నికల్లో 39.17 శాతం ఓట్లు పొందగా, ఇప్పుడు 40.06 శాతం ఓట్లు లభించే అవకాశం ఉందని సర్వే చెబుతోంది.

అయితే, జనసేన పార్టీకి గత ఎన్నికలతో పోల్చితే ఈసారి ఓటు బ్యాంకు తగ్గినట్టు అర్థమవుతోంది. 2019లో జనసేన ఓటింగ్ శాతం 5.53 కాగా, ఇప్పుడది 3.56 అని వీడీపీ సర్వే పేర్కొంటోంది.
ఏపీ సీఎంగా జగనే!

అంతేకాదు, ఇప్పుడు ఎవరిని ఏపీ ప్రజలు ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అనే అంశంలోనూ వీడీపీ సర్వే చేసింది. అత్యధికంగా వైఎస్ జగన్ ను 53.40 శాతం మంది కోరుకుంటున్నట్టు వెల్లడైంది. చంద్రబాబును 40.60 శాతం మంది సీఎంగా కోరుకుంటుండగా, జనసేనాని పవన్ కల్యాణ్ ను కేవలం 3.90 శాతం మందే కోరుకుంటున్నారు. పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణలకు ఒక్క శాతం మంది మద్దతు పలికారు.

వైసీపీకి దీటైన విపక్షం టీడీపీనే!

ఏపీలో అధికార వైసీపీకి సరైన ప్రతిపక్షం టీడీపీయేనని వీడీపీ సర్వేలో తేలింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి దీటుగా నిలిచే విపక్షం తెలుగుదేశం పార్టీ అని అత్యధికులు అభిప్రాయపడ్డారు. ఈ సర్వేలో టీడీపీకి మద్దతుగా 59 శాతం ఓట్లు రాగా, బీజేపీకి 8 శాతం, జనసేనకు 4 శాతం, కాంగ్రెస్ కు 1 శాతం ఓట్లు వచ్చాయి. తెలియదు అని, ఇప్పుడే చెప్పలేం అని అభిప్రాయపడిన వారి సంఖ్య 28 శాతం అని వీడీపీ వెల్లడించింది. ఈ మేరకు వీడీపీ ట్విట్టర్ లో పోస్టు చేసింది.

More Telugu News