ఇబ్రహీంపట్నం ప్రాంతానికి ఫార్మా సిటీ శాపంగా మారింది: కోమటిరెడ్డి

11-10-2020 Sun 16:51
MP Komatireddy responds on Ibrahimpatnam pharma city
  • ఫార్మాసిటీ అంశంపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం
  • గ్రీన్ ఫార్మాసిటీపై కేసు వేస్తానన్న కోమటిరెడ్డి
  • శంకుస్థాపనలు అడ్డుకోవాలన్న భట్టి

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇబ్రహీంపట్నం ఫార్మాసిటీ అంశంపై స్పందించారు. ఇబ్రహీంపట్నం ప్రాంతానికి ఫార్మాసిటీ ఓ శాపంలా మారిందని విమర్శించారు. గతంలో చౌటుప్పల్ ప్రాంతంలో ఫార్మా కంపెనీలు పెట్టడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భూములిచ్చిన రైతులకు రూ.12 లక్షలు ఇచ్చి కంపెనీలకు కోట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. గ్రీన్ ఫార్మా సిటీపై కేసు వేస్తానని వెల్లడించారు. ఫార్మా సిటీతో నేల, గాలి, నీరు కలుషితం అవుతున్నాయని అన్నారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందిస్తూ, ఫార్మా సిటీ పోరు రాష్ట్ర గతిని మార్చేస్తుందని ఉద్ఘాటించారు. రైతుల భూములను బలవంతంగా లాక్కోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. భూములు ఇవ్వకుండా సహాయనిరాకరణ ఉద్యమం చేయాలని, ఇక్కడ ఎలాంటి శంకుస్థాపనలు చేయకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.