అతి భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు... జాగ్రత్తగా ఉండాలి: సీఎం కేసీఆర్

11-10-2020 Sun 16:34
CM KCR alerts officials and people in the wake of weather forecast
  • బంగాళాఖాతంలో వాయుగుండం
  • తెలంగాణకు వర్షసూచన
  • సీఎస్ సోమేశ్ కుమార్ కు ఆదేశాలు ఇచ్చిన సీఎం కేసీఆర్

బంగాళాఖాతంలో వాయుగుండంతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీనిపై సీఎం కేసీఆర్ స్పందించారు. రాబోయే రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు, ప్రజలకు సూచించారు.

"రాష్ట్రంలో ఇవాళ చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రేపు, ఎల్లుండి కూడా భారీ, అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలి" అంటూ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సీఎస్ సోమేశ్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారు.

జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని, అధికారులంతా ఎక్కడివాళ్లు అక్కడే ఉండి పరిస్థితికి అనుగుణంగా సహాయ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. భారీ వర్షాలతో పాటే వరదలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని, ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.