నన్ను అరెస్ట్ చేయించేవరకు సీఎం అన్నం కూడా తినేట్టు లేరని సమాచారం అందుతోంది: రఘురామకృష్ణరాజు

11-10-2020 Sun 16:22
Raghurama Krishnaraju reacts in the wake of FIR
  • రఘురామకృష్ణరాజు సంస్థపై సీబీఐ కేసు
  • తన అరెస్టే జగన్ లక్ష్యమంటూ రఘురామ వ్యాఖ్యలు
  • ప్రవీణ్ ప్రకాశ్ తన బ్యాచ్ మేట్ తో పావులు కదిపారని వెల్లడి

ఇటీవల ఎంపీ రఘురామకృష్ణరాజుకు చెందిన ఇండ్-భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసినట్టు, ఆయనకు చెందిన నివాసాలు, కార్యాలయాలపై దాడులు జరిగినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్ట్ చేయించే వరకు సీఎం అన్నం కూడా తినేట్టు లేరని తాడేపల్లి వర్గాలంటున్నాయని వెల్లడించారు. తనను అరెస్ట్ చేయించాలని సీఎం జగన్ మంకుపట్టు పట్టారని అర్థమవుతోందని తెలిపారు.

తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించడంలో ప్రవీణ్ ప్రకాశ్ అనే అధికారి ప్రధాన పాత్ర పోషించాడని, ప్రవీణ్ ప్రకాశ్ కేంద్రంలో ఉన్న తన బ్యాచ్ మేట్ ద్వారా మంత్రాంగం చేసి సఫలమయ్యారని తెలిపారు. ప్రవీణ్ ప్రకాశ్ ను సీఎం సీబీఐ కేసుల నుంచి బయటపడేసేందుకు తెచ్చుకున్నారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. మరి ప్రవీణ్ ప్రకాశ్ రక్షకుడిగా ఉంటారో, తక్షకుడిగా ఉంటారో వేచిచూడాలని వ్యాఖ్యానించారు.