పాకిస్థాన్ లో మతగురువు హత్య... భారత్ పై దుమ్మెత్తిపోస్తున్న ఇమ్రాన్ ఖాన్

11-10-2020 Sun 14:53
Imran Khan targets India after Maulana Adil Khan killed in Karachi
  • కరాచీలో మౌలానా అదిల్ ఖాన్ హత్య
  • బైక్ పై వచ్చి కాల్పులు జరిపిన దుండగులు
  • మత విద్వేషాలు రగిల్చేందుకు భారత్ చేసిన ప్రయత్నమన్న ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ లోని కరాచీ నగరంలో మౌలానా అదిల్ ఖాన్ అనే మతగురువును కొందరు దుండగులు కాల్చి చంపారు. బైక్ పై వచ్చిన వ్యక్తులు ఆయనను అతి సమీపం నుంచి తుపాకులతో కాల్చారు. అయితే ఈ ఘటనపై పాకిస్థాన్ లో ఆగ్రహ జ్వాలలు రేగుతున్నాయి. సున్నీలు, షియాల మధ్య విద్వేషం రగిల్చేందుకు జరిగిన కుట్రగా పేర్కొంటున్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం అదే తరహాలో వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఉన్నది భారత్ అని, దేశవ్యాప్తంగా మతపరమైన అలజడులు రేపేందుకు భారత్ చేసిన ప్రయత్నంగా ఆరోపించారు. అయితే భారతే ఈ దాడికి సూత్రధారి అనేందుకు తగిన ఆధారాలు మాత్రం వెల్లడించలేదు.

కాగా, ఈ ఘటనపై కరాచీ పోలీస్ చీఫ్ గులాబ్ నబీ మెమన్ స్పందిస్తూ, ఈ దాడిలో మౌలానా అదిల్ ఖాన్ తో పాటు ఆయన డ్రైవర్ కూడా మరణించారని వెల్లడించారు. ఓ షాపింగ్ ఏరియాలో తన వాహనాన్ని నిలపగా, కొందరు సాయుధులు కాల్పులకు తెగబడ్డారని వివరించారు. ఈ దాడిలో ముగ్గురు దుండగులు పాల్గొన్నట్టు తెలిపారు.