ఇదిగో మహిళల ఐపీఎల్ షెడ్యూల్... కెప్టెన్లను ప్రకటించిన బీసీసీఐ

11-10-2020 Sun 14:37
BCCI announces women teams captains for IPL
  • యూఏఈ వేదికగా మహిళల ఐపీఎల్
  • మూడు జట్లు ఎంపిక చేసిన బీసీసీఐ
  • నవంబరు 4 నుంచి 9 వరకు టోర్నీ

ప్రస్తుతం యూఏఈలో పురుషుల ఐపీఎల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఐపీఎల్ ప్లే ఆఫ్ దశకు చేరుకున్న తర్వాత అమ్మాయిల జట్లతో మ్యాచ్ లు ఆడించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు మూడు జట్లు, వాటికి కెప్టెన్లను బోర్డు నేడు ప్రకటించింది. సూపర్ నోవాస్ జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్, ట్రైల్ బ్లేజర్స్ జట్టుకు స్మృతీ మంధనా, వెలాసిటీ జట్టుకు మిథాలీ రాజ్ నాయకత్వం వహిస్తారు.

ఈ మ్యాచ్ లు నవంబరు 4 నుంచి 9వ తేదీ వరకు యూఏఈలో జరుగుతాయి. ఈ మేరకు ఆయా జట్ల వివరాలను బీసీసీఐ వెల్లడించింది. ఐపీఎల్ లో పాల్గొనేందుకు ఎంపికైన మహిళా క్రికెటర్లు ముంబయి రావాలంటూ బోర్డు ఇప్పటికే సమాచారం అందించింది. వీరిని వారం రోజుల పాటు ముంబయిలో క్వారంటైన్ లో ఉంచనున్నారు.

కాగా, మహిళలు ఐపీఎల్ లో మూడు లీగ్ మ్యాచ్ లు, ఫైనల్ నిర్వహిస్తారు. నవంబరు 4న జరిగే తొలి మ్యాచ్ లో సూపర్ నోవాస్, వెలాసిటీ జట్లు తలపడతాయి.