ఏపీలో ఏం జరుగుతోందో అర్థం కావడంలేదు: సోమిరెడ్డి

11-10-2020 Sun 14:19
Somireddy Chandramohan Reddy says does not understand what is happening in AP
  • పాలన మృగ్యమైపోయిందని వెల్లడి
  • వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయంటూ వ్యాఖ్యలు
  • ఇది సరైన విధానం కాదంటూ వీడియో పోస్టు చేసిన సోమిరెడ్డి

ఏపీలో ఏంజరుగుతోందన్నది ఎవరికీ, ఏమీ అర్థంకావడంలేదని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పరిపాలన మృగ్యమైపోయిందని, ప్రజలకు అందుబాటులో పరిపాలన లేదని అన్నారు. మొత్తం వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి పతాకస్థాయికి చేరుకుందని, ఇది ఎవరూ ఊహించనిది అని సోమిరెడ్డి పేర్కొన్నారు.

ప్రపంచంలో ఏదేశంలోనూ నేరుగా న్యాయవ్యవస్థలపై దాడి చూడలేదని, రాజ్యాంగ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసే స్థాయికి దిగజారారని ఆరోపించారు. జడ్జిల గురించి, వారి కుటుంబాల గురించి ఓపెన్ డిబేట్లు పెట్టే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ఇది సరైన విధానం కాదని, ఎక్కడో ఒక చోట దీనికి అడ్డుకట్ట పడాలని, దీంట్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందో, సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటుందో అందరం వేచి చూస్తున్నామని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ వీడియో పోస్టు చేశారు.