SP Sailaja: నాకు మొదటి పాట పాడేంతవరకు బెరుకుగా ఉంటుంది, నీకెలా ఉంటుంది? అనేవాడు: బాలు గురించి ఎస్పీ శైలజ

Veteran Singer SP Sailaja talks about her brother SP Balasubrahmanyam
  • ఇటీవలే ఈ లోకాన్ని వదిలి వెళ్లిన బాలు
  • అన్నయ్య గురించి చెప్పిన ఎస్పీ శైలజ
  • పాటల రూపంలో ప్రపంచమంతా ఉన్నాడని వ్యాఖ్యలు
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇటీవలే కన్నుమూయడంతో ఆయన అభిమాన జనం ఇప్పటికీ కించిత్ విషాదంలోనే ఉన్నారు. ఈ క్రమంలో ఆయన సోదరి, ప్రముఖ గాయని ఎస్పీ శైలజ మీడియాతో మాట్లాడారు. ఓ టీవీ చానల్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆమె తన అన్నయ్య గురించి వివరించారు. పాటలు పాడడమే కాకుండా, ఎలా మెలగాలి అనే విషయాలు కూడా తన సోదరుడి నుంచే నేర్చుకున్నానని, ప్రతిదీ నేర్పించిందీ తన అన్నయ్యేనని శైలజ వెల్లడించారు.

ఆయనతో కలిసి వేల సంఖ్యలో కచేరీలు చేశానని, ప్రతి కచేరీకి ఎంతో కచ్చితంగా సాధన చేయించేవాడని వివరించారు. ప్రతి కచేరీని  ఇదే మొదటి కచేరీ అన్నంతగా తపన పడేవాడని తెలిపారు. "స్టేజీ మీదకు వెళుతూ కూడా... నాకు మొదటి పాట పాడేంతవరకు ఎంతో కంగారు, భయం కలుగుతాయి, నీకెలా ఉంటుంది అని బాలు అన్నయ్య నన్ను అడిగేవాడు. స్టేజి మీదకు వెళ్లాక పాడక తప్పదు కదా, అంతా దైవాధీనం అనే దాన్ని. అయితే ఎన్ని వేల కచేరీలు చేసినా, ఏ కచేరీకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఆ మేరకు ఇచ్చేవాడు.

ఆయనకు కోపం తక్కువ. ముఖ్యంగా ఎవరైనా తప్పుగా పాడుతున్నా సరిదిద్దుతాడు తప్ప కోప్పడడు. కోప్పడితే వారు ఎక్కడ కలత చెంది సరిగా పాడలేకపోతారేమోనని ఆలోచించేవాడు. ఇవాళ నేనీ స్థాయిలో ఉన్నానంటే అన్నయ్యే కారణం. ఇవాళ ఆయన మా మధ్య లేకపోవడంతో శూన్యంలో ఉన్నట్టు అనిపిస్తోంది. భౌతికంగా లేకపోయినా, ఈ ప్రపంచమంతా తన పాటల రూపంలో ఉన్నాడని భావిస్తాం" అంటూ తన అభిప్రాయాలు పంచుకున్నారు.
SP Sailaja
SP Balasubrahmanyam
Singer
Tollywood

More Telugu News