అమెరికా ఎన్నికల్లో ఆయనకే ఓటు వేయండి: పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్

11-10-2020 Sun 11:20
greta thunberg supports biden
  • డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు మద్దతు
  • బైడెన్‌ ను ఎన్నుకోవాలని పిలుపు
  • నేరుగా రాజకీయాలపై మాట్లాడిన థన్ బర్గ్

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్ ఈ విషయంపై స్పందించారు. పర్యావరణ మార్పులపై చేస్తున్న పోరాటానికి ఈ ఎన్నికలు చాలా కీలకమని చెప్పారు. అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు తన మద్దతును ప్రకటించారు.

ఆ దేశంలోని ఓటర్లంతా బైడెన్‌ ను ఎన్నుకోవాలని థన్‌బర్గ్ కోరారు. గతంలో ఆమె రాజకీయాలపై నేరుగా ఎన్నడూ మాట్లాడలేదు. చిన్న వయసులోనే పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతోన్న థన్‌బర్గ్‌ పలు అంతర్జాతీయ వేదికలపై దేశాధినేతలను ప్రశ్నించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణం రోజురోజుకీ నాశనం అయిపోతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ  ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ ఆమె నిలదీశారు.

ఆమె ఐక్యరాజ్యసమితితో పాటు అనేక వేదికలపై ఈ విషయంపై ప్రపంచ దేశాల అధినేతలను ప్రశ్నించారు. అయితే, ఆమెపై‌ ట్రంప్ మొదటి నుంచి విమర్శలు చేస్తూ.. ఆగ్రహాన్ని ఆమె నియంత్రించుకోవాలని చెప్పారు.  బైడెన్‌ మాత్రం ఆమె చేస్తోన్న పోరాటానికి మద్దతు తెలుపుతున్నారు.