రేపు తీరం దాటనున్న వాయుగుండం... ఆ వెంటనే 14న మరో అల్పపీడనానికి చాన్స్!

11-10-2020 Sun 06:34
Another Low Preasure Chance in Bay of Bengal
  • నేటి సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం
  • ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు
  • వరుస అల్పపీడనాలతో మరిన్ని వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో మరింత వర్షం కురవనుంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడనాలకు తోడు, ఉపరితల ద్రోణి, ఆవర్తనాల కారణంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం, నేటి సాయంత్రానికి వాయుగుండంగా మారి, ఆపై 12వ తేదీ మధ్యాహ్నం తరువాత ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతంలో తీరాన్ని దాటవచ్చని అధికారులు అంచనా వేశారు.

దీని ప్రభావంతో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. ఆపై 14వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నామని పేర్కొన్న వాతావరణ శాఖ, దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు, ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.