కరోనాపై యుద్ధం ఇంకా పూర్తి కాలేదు: దత్తాత్రేయ

10-10-2020 Sat 21:58
Himachal Pradesh governor Dattatreya says war against corona yet to be finished
  • మోదీ జన్ ఆందోళన్ కు దత్తాత్రేయ మద్దతు
  • వ్యాక్సిన్ ఇంకా రాలేదన్న విషయాన్ని గుర్తెరగాలి 
  • టీకా వచ్చేవరకు జాగ్రత్తగా ఉండాలని హితవు

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కరోనా పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పండుగల సీజన్ నేపథ్యంలో కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన జన్ ఆందోళన్ కార్యక్రమానికి మద్దతుగా మాట్లాడుతూ, కరోనాపై యుద్ధం ఇంకా ముగియలేదని అన్నారు.

వ్యాక్సిన్ ఇంకా రాలేదన్న విషయం గుర్తెరగాలని, టీకా వచ్చేవరకు ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రపరుచుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు. పబ్లిక్ ప్లేసుల్లో మనిషికి మనిషికి మధ్య రెండు గజాల దూరం పాటించాలని దత్తాత్రేయ సూచించారు. ప్రజలు అజాగ్రత్తను దరిచేరనివ్వరాదని అన్నారు.