Narendra Modi: బీజేపీ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లిన మోదీ, అమిత్ షా!

  • బీహార్ ఎన్నికల నేపథ్యంలో చర్చలు జరుపుతున్న హైకమాండ్
  • అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనున్న నేతలు
  • 121-122 స్థానాలను పంచుకున్న బీజేపీ-జేడీయూ
Modi and Amit Shah reaches BJP head quarters

బీహార్ ఎన్నికల నేపథ్యంలో కార్యాచరణను రూపొందించేందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా మోదీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర సీనియర్ నేతలు స్వాగతం పలికారు. బీహార్ ఎన్నికల్లో పోటీ చేయబోయే బీజేపీ అభ్యర్థుల గురించి చర్చించి, తుది జాబితాను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. అక్టోబర్, నవంబర్ మాసాల్లో జరగనున్న ఈ ఎన్నికలకు సంబంధించి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కావడం ఇది రెండో సారి.

ఈ వారం ప్రారంభంలో ఎన్డీయేలోకి బీహార్ కు చెందిన వికాశీల్ ఇన్సాన్ పార్టీని చేర్చుకున్నారు. దీంతో, ఆ పార్టీకి 11 స్థానాలను కేటాయించారు. చిరాగ్ పాశ్వాన్ కు చెందిన లోక్ జనశక్తి పార్టీ కూటమి నుంచి బయటకు రావడంతో ఇన్సాన్ పార్టీకి బీజేపీ అవకాశం కల్పించింది.

మరోవైపు కూటమిలోని జేడీయూ ఇప్పటికే 115 మంది పేర్లతో తమ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ను నిరాకరించింది. పొత్తులో భాగంగా ఇతర పార్టీలకు అవకాశం కల్పించేందుకు జేడీయూ ఈ నిర్ణయం తీసుకుంది.

పొత్తులో భాగంగా 121 స్థానాల్లో బీజేపీ, 122 స్థానాల్లో జేడీయూ పోటీ చేయనున్నాయి. తమ కోటా నుంచే జితిన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా పార్టీకి జేడీయూ సీట్లను కేటాయించింది. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 10 వరకు జరగనున్న ఈ ఎన్నికలకు సంబంధించి మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది.

More Telugu News