JC Diwakar Reddy: మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మైనింగ్ శాఖ నోటీసులు

  • జేసీ కుటుంబానికి చెందిన క్వారీల్లో అధికారుల తనిఖీలు
  • నిబంధనల ఉల్లంఘన జరిగిందన్న గనుల శాఖ
  • అందుకే నోటీసులు పంపామని వెల్లడి
Mining department issues notices to JC Diwakar Reddy

టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి గనుల శాఖ నోటీసులు జారీ చేసింది. జేసీ కుటుంబానికి చెందిన రెండు క్వారీల్లో మైనింగ్ కార్యకలాపాల వివరాలు కోరుతూ భూగర్భ గనుల శాఖ నోటీసులు పంపింది. 15 రోజుల్లో వివరాలు సమర్పించాలంటూ అధికారులు స్పష్టం చేశారు.

జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి ముచ్చుకోటలో మైనింగ్ క్వారీలు ఉన్నాయి. వీటిలో తనిఖీలు నిర్వహించిన అధికారులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమణారావు మాట్లాడుతూ, సుమన, బ్రమరాంభ సంస్థల పేరుతో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న జేసీ దివాకర్ రెడ్డి కార్మికుల భద్రతను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. పైగా, మినరల్ మేనేజర్ పర్యవేక్షణలో మైనింగ్ కార్యకలాపాలు జరగడంలేదని వివరించారు.

రెండు క్వారీల్లో ఉల్లంఘనలు జరిగినట్టు గుర్తించినందునే నోటీసులు జారీ చేశామని, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని  వెల్లడించారు. కాగా, తన క్వారీల్లో తనిఖీలపై వివరణ కోరేందుకు నిన్న తాడిపత్రిలోని గనుల శాఖ కార్యాలయానికి వచ్చిన జేసీ తాను వచ్చిన సమయానికి గనుల శాఖ ఏడీ లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.

More Telugu News