లాక్ డౌన్ తర్వాత థియేటర్లలో విడుదలవుతోన్న తొలి సినిమా ఇదే!

10-10-2020 Sat 11:45
The first movie to release in Theatre
  • ‘పీఎం నరేంద్రమోదీ’ సినిమా విడుదలకు సిద్ధం
  • ఈ నెల 15న థియేటర్లలో విడుదల
  • మోదీ పాత్రలో నటించిన వివేక్‌ ఒబేరాయ్‌  

‘పీఎం నరేంద్రమోదీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఆ సినిమా యూనిట్ విడుదల తేదీని ఖరారు చేసి ప్రకటన చేసింది. మోదీ పాత్రలో వివేక్‌ ఒబేరాయ్‌ నటించిన ఈ సినిమా విడుదల ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. ఈ సినిమాను మే 24న రిలీజ్‌ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే, కరోనా వల్ల అది కుదరలేదు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా సుదీర్ఘకాలం పాటు విడుదలకు నోచుకోలేదు. ఓటీటీలో విడుదల చేయడానికి సినీ యూనిట్ సుముఖంగా లేదు.

ఈ నెల 15 నుంచి సినిమా థియేటర్లను కరోనా నిబంధనలు పాటిస్తూ తెరవడానికి అనుమతులు రావడంతో చివరకు ఈ సినిమాను విడుదల చేయడానికి ఆ సినీ యూనిట్ సిద్ధమైంది. లాక్ డౌన్ అనంతరం విడుదలవుతున్న తొలి సినిమా ఇదేనంటూ ఈ చిత్రయూనిట్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ నెల 15నే ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ చిత్రానికి ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు.