ప్రభాస్ సినిమాకు 40 రోజులు కేటాయించిన అమితాబ్!

10-10-2020 Sat 11:12
Amitab spares forty days to Prabhas film
  • ప్రభాస్ సినిమాలో కీలక పాత్రలో అమితాబ్ 
  • జనవరి నుంచి ప్రభాస్, దీపికలతో షూటింగ్
  • ఏప్రిల్ లో జాయిన్ కానున్న అమితాబ్
  • గర్వించదగ్గ సినిమా అంటున్న నిర్మాత  

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించే భారీ చిత్రం అనేక ప్రత్యేకతలను సంతరించుకుంటోంది. కథానాయికగా బాలీవుడ్ భామ దీపిక పదుకొనే నటించనుండడం ఒక పెద్ద విశేషం అయితే... కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించనుండడం మరో పెద్ద విశేషం. అందులోనూ అమితాబ్ ఇందులో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ ను పోషిస్తున్నారట.

ఈ విషయం గురించి చిత్ర నిర్మాత అశ్వనీదత్ చెబుతూ, "ఇందులో అమితాబ్ గారిది చాలా బలమైన, కీలకమైన పాత్ర. షూటింగుకి ఆయన 40 రోజులు కేటాయించారు. అంటే దానిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఆ పాత్ర ఎంత కీలకమైనదో! జనవరి నుంచి షూటింగ్ మొదలెడతాం. ముందుగా ప్రభాస్, దీపికలు పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తాం.

ఇక ఏప్రిల్ నుంచి అమితాబ్ ఈ చిత్రం షూటింగులో జాయిన్ అవుతారు. తెలుగు సినిమా పరిశ్రమ గర్వించదగ్గ సినిమాలలో కచ్చితంగా ఇదొకటి అవుతుంది" అని చెప్పారు. 'వైజయంతీ మూవీస్ ని ప్రారంభించింది ఎన్టీఆర్ గారు. అప్పుడు ఆ లెజండ్ తో చేశా.. ఇప్పుడీ లెజండ్ తో చేస్తున్నా' అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఇక ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు. తెలుగు వెర్షన్ తో పాటు హిందీ వెర్షన్ ను కూడా ఏకకాలంలో నిర్మిస్తున్నారు. మరోపక్క, ఈ చిత్రంలో ఓ ప్రముఖ హీరో విలన్ పాత్ర  పోషిస్తారని అంటున్నారు. విజయదశమికి ఆ వివరాలను కూడా ప్రకటించే అవకాశం వుంది.