TikTok: చైనాకు షాకిచ్చిన పాక్.... టిక్ టాక్ యాప్ పై నిషేధం!

  • టిక్ టాక్ ను బ్లాక్ చేసిన పాక్ టెలికమ్యూనికేషన్ అథారిటీ
  • అనైతిక కంటెంట్ ఉందంటూ ఆరోపణ
  • నోటీసులు కూడా ఇచ్చామన్న పీటీఏ
Pakistan telecom authority blocked Chinese app Tik Tok

చైనాతో పాకిస్థాన్ ఎంత సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతర్జాతీయ వేదికలపై సైతం ఇరు దేశాలు ఇంచుమించు ఒకే మాటగా పయనిస్తుంటాయి. అలాంటి ఘనతర మిత్రదేశమైన చైనాకు పాక్ షాకిచ్చింది. చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ కార్యకలాపాలను తమ దేశంలో రద్దు చేసింది. ఇప్పటికే టిక్ టాక్ పై భారత్, అమెరికా నిషేధం విధించాయి. ఈ వరుసలో పాక్ కూడా చేరింది.

చట్టవ్యతిరేకమైన ఆన్ లైన్ కంటెంట్ విస్తృతస్థాయిలో వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో టిక్ టాక్ విఫలమైందంటూ పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ (పీటీఏ) స్పష్టం చేసింది. టిక్ టాక్ యాప్ లో అనైతిక, అసభ్య కంటెంట్ ఉందంటూ వివిధ రంగాల నుంచి వచ్చిన అసంఖ్యాక ఫిర్యాదుల నేపథ్యంలోనే పీటీఏ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. టిక్ టాక్ లో అశ్లీలత ఉంటోందన్న కోణంలో ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని, దాంతో టిక్ టాక్ కు ఆఖరిగా నోటీసులు పంపించామని పీటీఏ వివరించింది.

తమ నోటీసులపై స్పందించేందుకు తగిన సమయం కూడా ఇచ్చామని పేర్కొంది. కానీ, టిక్ టాక్ తమ నిబంధనావళిని సంతృప్తి పరిచేలా వ్యవహరించలేకపోయిందని, అందుకే ఆ యాప్ కార్యకలాపాలను అడ్డుకుంటున్నామని పీటీఏ వివరించింది. కాగా, భారత్, అమెరికా వంటి దేశాల్లో టిక్ టాక్ యాప్ కు ఎదురవుతున్న వ్యతిరేకతపై తీవ్రస్థాయిలో స్పందిస్తున్న చైనా.. ఇప్పుడు తన మిత్రదేశం పాక్ తీసుకున్న నిర్ణయంపై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.


More Telugu News