Corona Virus: కరోనా సోకిన వారి శరీరంలో మూడు నెలల వరకు యాంటీబాడీలు: తేల్చిన పరిశోధకులు

  • గుర్తించిన అమెరికాలోని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్ పరిశోధకులు
  • 343 మంది కరోనా రోగుల్లోని యాంటీబాడీలపై పరిశోధన
  • 122 రోజుల పాటు పరిశీలన
  • ఐజీజీ ప్రతిరక్షకాలు రక్తంతో పాటు లాలాజలంలో ఉన్నట్లు నిర్ధారణ 
corona antibodies in human body

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దీనిపై ఎన్నో పరిశోధనలు చేస్తోన్న శాస్త్రవేత్తలు కీలక విషయాలను గుర్తిస్తున్నారు. కరోనా శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఆ వైరస్ ను ఎదుర్కొనేందుకు ఉత్పత్తయ్యే ప్రతిరక్షకాల (యాంటీబాడీలు)పై పరిశోధనలు చేస్తోన్న  అమెరికాలోని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన శాస్త్రవేత్తలు, ఇతర పరిశోధకులు తాజాగా తెలిపిన పలు వివరాలను  జర్నల్‌ సైన్స్‌లో ప్రచురించారు.

కొవిడ్-19 సోకిన రోగుల్లో కనీసం మూడు నెలల వరకు యాంటీబాడీలు ఉంటాయని వారు తేల్చారు.  తమ పరిశోధనలో భాగంగా 343 మంది కరోనా రోగుల్లోని రక్తంలో ఉన్న యాంటీబాడీలపై వారు అధ్యయనం చేశారు. వైరస్‌ లక్షణాలు తేలిన తరువాత 122 రోజుల పాటు పరిశీలించారు. వారి శరీరంలో దాదాపు మూడు నెలల పాటు ప్రతిరక్షకాలున్నాయని గుర్తించారు.

కరోనాను గుర్తించడంలో ప్రత్యామ్నాయ పరీక్ష విధానానికి కూడా ఈ పరిశోధన ఫలితాలు ఉపయోగపడతాయని చెప్పారు. అంతేగాక, శరీరంలో ప్రతిరక్షకాల పరీక్ష కోసం లాలాజలాన్ని ప్రత్యామ్నాయ బయో ఫ్లూయిడ్‌గా ఉపయోగించొచ్చని పేర్కొన్నారు. ప్రతిరక్షకాలను ఐజీజీ, ఐజీఏ, ఐజీఎంలుగా వర్గీకరించి వీటిలో ఐజీజీ రకం ప్రతిరక్షకాలు రక్తంతో పాటు లాలాజలంలో అధిక కాలం వుంటాయని తేల్చారు.

More Telugu News