Cash for Vote: ఓటుకు నోటు కేసు విచారణ ఈ నెల 12కి వాయిదా

  • తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు అంశం
  • ఇవాళ విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు
  • ఈ నెల 12 నుంచి రోజువారీ విచారణ
Cash for vote issue adjourned to next week

కొన్నేళ్ల కిందట ఓటుకు నోటు కేసు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య వంటి రాజకీయనేతలతో పాటు సెబాస్టియన్, ఉదయసింహ తదితరులు నిందితులుగా ఉన్నారు. తాజాగా ఈ వ్యవహారంపై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. అనంతరం ఈ నెల 12కి విచారణ వాయిదా వేసింది. ఈ నెల 12 నుంచి ఈ కేసులో రోజువారీ విచారణ ఉంటుందని ఏసీబీ న్యాయస్థానం పేర్కొంది.

కాగా, ఈ కేసులో ఆడియో టేపుల విషయంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) రిపోర్టు కీలక ఆధారంగా భావిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో దర్యాప్తు చేస్తున్న ఏసీబీ ఇప్పటికే 960 పేజీలతో కూడిన చార్జిషీటు దాఖలు చేసింది. స్టీఫెన్ సన్ కు రేవంత్ రెడ్డి ఇవ్వజూపిన డబ్బు ఎక్కడిదన్నది ఈ కేసులో కీలక అంశం. దీనిపై న్యాయస్థానం ఏం తీర్పు ఇస్తుందన్న విషయం ఆసక్తికరంగా మారింది.

2015లో తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి... ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డి విజయం కోసం అప్పటి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను నగదుతో ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారన్న ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఆయన జైలుకు కూడా వెళ్లొచ్చారు.

More Telugu News