Baba Ka Daba: సోషల్ మీడియా చలవతో మళ్లీ పుంజుకున్న 'బాబా కా దాబా'!

  • ఢిల్లీలో చిన్న దాబా హోటల్ నడుపుతున్న వృద్ధ దంపతులు
  • కరోనా దెబ్బకు వ్యాపారం కుదేల్
  • వీడియో తీసి పోస్టు చేసిన ఫుడ్ బ్లాగర్
  • విశేషంగా స్పందించిన నెటిజన్లు
Social media helps the revival of Baba Ka Dhaba

ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పేరు బాబా కా దాబా. సౌత్ ఢిల్లీ మాలవ్యా నగర్ వాసులైన ప్రసాద్ (80), దేవి దంపతులు బాబా కా దాబా పేరుతో చిన్న హోటల్ ను 30 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. అయితే కరోనా దెబ్బకు వీరి చిన్న దాబా తీవ్రంగా నష్టపోయింది. కరోనా ముందు రోజుల్లో నెలకు రూ.5 వేల వరకు ఆదాయం వచ్చేది. లాక్ డౌన్ ప్రకటించాక అది కూడా లేదు. కరోనా వ్యాప్తి భయంతో స్థానికులు ఆ బాబా కా దాబాకు రావడం మానేశారు. దాంతో ప్రసాద్, దేవి వృద్ధ దంపతుల పరిస్థితి దయనీయంగా మారింది.

ఒకరోజు గౌరవ్ వాసన్ అనే ఫుడ్ బ్లాగర్ బాబా కా దాబాకు వచ్చి ప్రసాద్ ను కదిపాడు. ఇవాళ ఎంత వ్యాపారం చేశారని ప్రసాద్ ను అడగ్గా, ఆ వృద్ధుడు కళ్లనీళ్లు పెట్టుకుంటూ గల్లా పెట్టెలో ఉన్న 50 రూపాయలను చూపించాడు. అది చూసి గౌరవ్ వాసన్ చలించిపోయాడు. వెంటనే బాబా కా దాబా పై ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. సీన్ కట్ చేస్తే... ఇప్పుడా బాబా కా దాబా మునుపటి రీతిలో కళకళలాడుతోంది.

స్థానిక ఎమ్మెల్యే ముందుకొచ్చి ప్రసాద్ దంపతులను ఆదుకుంటానని భరోసా ఇవ్వడమే కాదు ఆర్థికసాయం కూడా చేశారు. అనేక ఫుడ్ డెలివరీ యాప్ లు కూడా బాబా కా దాబాకు చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చాయి. స్థానికులు ఆ చిన్న హోటల్ కు వచ్చి అక్కడున్నవన్నీ కొంటూ ఆ వృద్ధ దంపతుల ముఖాల్లో వెలుగులు నింపారు.

అంతకుముందు, గౌరవ్ వాసన్ పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో ఓ ప్రభంజనంలా పాకిపోయింది. సినీ ప్రముఖులు, క్రికెటర్లు కూడా స్పందించి సాయం చేసేందుకు ఆసక్తి ప్రదర్శించారు. మొత్తమ్మీద సోషల్ మీడియా పుణ్యమా అని బాబా కా దాబా మళ్లీ వెలిగిపోతోంది. ప్రస్తుతం 'బాబా కా దాబా' హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రాచుర్యం పొందుతోంది.


More Telugu News