Raghu Rama Krishna Raju: నాపై ఈ సీబీఐ కేసు వేయించింది ఆయనే!: రఘురామకృష్ణరాజు

  • రఘురామకు చెందిన సంస్థపై సీబీఐ కేసు
  • ఎలాంటి అక్రమాలు చేయలేదన్న నరసాపురం ఎంపీ
  • మరో కేసు వేయడం ఎందుకని ఆగిపోయానంటూ వ్యాఖ్యలు
MP Raghurama Krishnam Raju press meet over CBI Case

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు చెందిన ఇండ్-భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ సంస్థతో పాటు, ఆ సంస్థ డైరెక్టర్లు, అధికారులపై సీబీఐ ఢిల్లీ బ్రాంచ్ కేసు నమోదు చేయడం తెలిసిందే. బిజినెస్ పేరిట లోన్ తీసుకుని రూ.826.17 కోట్ల మేర దారిమళ్లించారన్న ఆరోపణలపై సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. ఈ అంశంపై రఘురామకృష్ణరాజు ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

తనను ఎంపీగా అనర్హుడ్ని చేయలేని వైసీపీ నేతలు ఇలాంటి చవకబారు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తాను బ్యాంకులకు రూ.23 వేల కోట్లు ఎగవేశానంటూ రాయడం ద్వారా ఓ పత్రిక విశ్వసనీయత పాతాళానికి పడిపోయిందని అన్నారు. ఈ సందర్భంగా అసలు తనపై ఆరోపణలకు కారణాలు ఏంటి? ఎవరు తనపై కేసు వేశారు? అసలు జరిగింది ఏమిటి? అనే అంశాలను రఘురామకృష్ణరాజు మీడియాకు వివరించారు.

"బ్యాంకుల నుంచి మేం తీసుకున్న రుణం రూ.4 వేల కోట్ల లోపే ఉంటుంది. అందులో రూ.2 వేల కోట్లు ఇంకా బ్యాంకు ఖాతాల్లోనే ఉన్నాయి. నాపై కేసు నమోదైంది అక్టోబరు 6న. అదే రోజున సీఎం జగన్ ప్రధాని మోదీని కలవడం, పీఎన్ బీ బ్యాంకు చైర్మన్ సీఎం జగన్ ను కలవడం అనుమానాలు కలిగిస్తోంది. వాళ్లపై రూ.43 వేల కోట్లకు అవినీతి ఆరోపణలు ఉండడంతో నాపై రూ.23 వేల కోట్లు అని ఆరోపణలు చేశారనుకుంటున్నా. అవాస్తవాలతో కథనాలు రాసిన వారిపై కేసులు వేద్దామని మా లాయర్లు చెబుతున్నారు కానీ, మరో మూడ్నాలుగు నెలల్లో జైలుకు వెళ్లే వారిపై మరో కేసు వేయడం ఎందుకుని ఆగిపోయాను.

నా వ్యాపారాల్లో ఎలాంటి అవకతవకలు లేవు. నిధులన్నీ నేను స్వాహా చేస్తే ప్రాజెక్టులు కట్టేదెవరు? సీబీఐ అడిగే అన్ని ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు చెబుతా. నాపై ఈ సీబీఐ కేసు వేయించేలా చేసింది సీఎం జగన్ కార్యాలయ ఉన్నతాధికారి ప్రవీణ్ ప్రకాశ్. కేంద్ర ఆర్థికశాఖలో ప్రవీణ్ ప్రకాశ్ బ్యాచ్ మేట్ ఉన్నారు. ఆయన ద్వారానే ఈ కేసు వేయించారు" అంటూ వివరించారు.

More Telugu News