బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి భారీ వర్షసూచన

09-10-2020 Fri 14:26
  • వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం
  • ఉరుములు, పిడుగులతో కూడిన వానలు
  • ఆదివారం సాయంత్రం తీరం దాటనున్న వాయుగుండం
Low Pressure area formed in Bay Of Bengal
బంగాళాఖాతంలో ఇది తుపాను సీజన్ గా పరిగణిస్తారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా అక్టోబరు, నవంబరు మాసాల్లో అల్పపీడనాలు ఏర్పడుతూ, అవి తుపానులుగా బలపడుతుంటాయి. తాజాగా, ఉత్తర అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాలను తాకుతూ తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.

ఇది రాగల 24 గంటల్లో వాయుగుండంగా బలపడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఆపై, వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఆదివారం సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని తన నివేదికలో వివరించింది. అల్పపీడన ప్రభావం రాష్ట్రంలో ఇవాళ్టి నుంచే కనిపిస్తుందని, అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. శనివారం ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు పడతాయని, ఆదివారం నాడు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులకు కూడా ఏపీ విపత్తుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు ఓ ప్రకటనలో వెల్లడించారు.