Hyderabad: దుర్గం చెరువు వంతెనపై రాత్రిపూట ఆకతాయిలు... సైబరాబాద్ ట్రాఫిక్ షేర్ చేసిన వీడియో ఇదిగో!

  • ఇటీవల ప్రారంభమైన కేబుల్ వంతెన
  • నిబంధనలను అతిక్రమిస్తున్న యువత
  • ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
Cyberabad Police Arrest Three Youth on Cable Bridge Video Viral

హైదరాబాద్ నగరానికి మణిహారంగా ఇటీవల ప్రారంభమైన దుర్గం చెరువు తీగల వంతెనపైకి రాత్రి 11 తరువాత అనుమతి లేదని, ఎవరైనా వంతెన పైకి ఎక్కితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నా, ఆకతాయిలు, పోకిరీలు వినట్లేదు. పోలీసుల కళ్లుగప్పి వంతెనపైకి వెళ్లి, తిరుగుతున్నారు. బ్రిడ్జ్ పై పడుకుని మరీ సెల్ఫీలు దిగుతున్నారు.

తాజాగా, వంతెనపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయగా, అర్థరాత్రి, ముగ్గురు తింగరోళ్లు బ్రిడ్జిపైకి ఎక్కి, ఫోటోలకు ఫోజులిస్తుండగా, దీన్ని గుర్తించిన కంట్రోల్ రూమ్ సిబ్బంది, పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు సమాచారం ఇచ్చి వారి ఆట కట్టించారు. ఇందుకు సంబంధించిన వీడియోను పోలీసులు, తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది.

రాత్రి 11 తరువాత వంతెనపైకి వెళ్లేందుకు అనుమతి లేదని, డివైడర్లను దాటడం, వంతెన చివర అంచులపైకి ఎక్కడం నేరమని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ ఈ సందర్భంగా హెచ్చరించారు. వంతెనపై బర్త్ డే పార్టీలు చేసుకునేందుకు అనుమతి లేదని, శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ అన్ని రకాల వాహనాల రాకపోకలపైనా నిషేధం అమలవుతుందని, ఆ సమయంలో సందర్శకులకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.

తీగల వంతెన చుట్టుపక్కల ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, వంతెనపై వాహనాల వేగం గంటకు 35 కిలోమీటర్లు మించరాదని తెలిపారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసిన వీడియోలో, పోలీసు వాహనం వస్తున్నా పట్టించుకోకుండా, ఓ యువకుడు చొక్కా విప్పేసి నేలపై పడుకుని ఫోటోలు దిగుతున్నట్టు కనిపిస్తోంది. పోలీసులు రాగానే, చెప్పులు చేత్తో పట్టుకుని అతను పరుగు లంఘించుకున్నాడు. పోలీసులు ఈ ముగ్గురినీ అరెస్ట్ చేసి, మాదాపూర్ పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News