Corona Virus: తగ్గిన కరోనా పాజిటివిటీ రేటు... మహమ్మారిని జయించే దిశగా నడుస్తున్న 22 రాష్ట్రాలు

  • జాతీయ సగటుకన్నా తక్కువగా టెస్ట్ పాజిటివ్ రేటు
  • మరింతగా తగ్గితే, కరోనా కనుమరుగు
  • 10 లక్షల మందిలో 865 మందికి టెస్టులు
  • రోజుకు 15 లక్షల టెస్టులు చేసే సామర్థ్యం
Corona Test Positive Rate in 22 States is Below Average

ఇండియాలోని 22 రాష్ట్రాలు కరోనాను జయించే దిశగా నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా టెస్ట్ పాజిటివ్ రేటు, గడచిన 11 రోజుల వ్యవధిలో 8.2 శాతానికి తగ్గితే, ఈ 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 5 శాతానికన్నా తక్కువకు పడిపోయింది.

ఈ విషయాన్ని వెల్లడించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోనూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సిఫార్సుల ప్రకారం, ప్రతి పది లక్షల మందిలో రోజుకు 140 మందికి టెస్ట్ ల చేయించాలని ఉండగా, అందుకు ఎన్నో రెట్ల పరీక్షలను చేయిస్తున్నామని వెల్లడించింది. క్రమానుగుణంగా టెస్టుల సంఖ్యను పెంచుతున్నామని, ఇదే సమయంలో పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గుతోందని పేర్కొంది.

కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతం ఇండియాలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైందని, చాలా ప్రాంతాల్లో వైరస్ కట్టడి విజయవంతంగా జరుగుతోందని, ప్రస్తుతం రోజుకు ప్రతి పది లక్షల మంది జనాభాలో 865 మందికి టెస్టులు జరుగుతున్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ ప్రతి పది లక్షల మందిలో 60,323 మందికి పరీక్షలు చేశామని, యూఎస్ లో మిలియన్ జనాభాలో 3.44 లక్షలకు పైగా పరీక్షలు జరిగాయని, ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్ లో 84 వేలకు పైగా టెస్టులు జరిగాయని తెలియజేసింది.

ఇండియాలోని బీహార్, మిజోరాం, గుజరాత్, ఝార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉందని, ప్రస్తుతం దేశంలో ఐసీఎంఆర్ అనుమతి పొందిన 1,900కు పైగా ల్యాబ్ లలో పరీక్షలు జరుగుతున్నాయని వెల్లడించింది. రోజుకు 15 లక్షల నమూనాలను పరీక్షించే స్థాయికి ఇండియా చేరుకుందని, బుధవారం నాడు 11.94 లక్షలకు పైగా నమూనాలను పరీక్షించామని, కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ 8.34 కోట్లకు పైగా టెస్ట్ లను చేశామని తెలిపింది.

జూన్, జూలై నెలలతో పోలిస్తే, కరోనా పాజిటివ్ రేటు గణనీయంగా తగ్గిందని, ఈ రేటు మరింతగా తగ్గితే, కరోనాను చాలా రాష్ట్రాలు జయించినట్టేనని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రతి కరోనా సోకిన వ్యక్తి ద్వారా ప్రస్తుతం 1.23 మందికి వ్యాధి సోకుతోందని, ఇది 1 కన్నా తక్కువకు దిగివస్తే, మహమ్మారి నుంచి ఇండియా మరింత త్వరగా బయట పడుతుందని వెల్లడించారు.

More Telugu News