Donald Trump: బైడెన్ గెలిచినా మూన్నాళ్ల ముచ్చటే... పదవిని కమలా హారిస్ లాగేసుకుంటుందన్న ట్రంప్!

Trump Says If Biden Wins Kamala Will Takeover In A Month
  • నవంబర్ 3న అధ్యక్ష ఎన్నిక
  • నిన్న ఉపాధ్యక్ష అభ్యర్థుల డిబేట్
  • కమలా హారిస్ లక్ష్యంగా ట్రంప్ విసుర్లు
వచ్చే నెల 3న జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించినా, అది మూన్నాళ్ల ముచ్చటే అవుతుందని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెటైర్లు వేశారు.

వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, నెల రోజుల వ్యవధిలోనే బైడెన్ ను పదవి నుంచి దింపేసి, తాను ఆ పీఠాన్ని ఎక్కుతారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఉపాధ్యక్ష పదవికి బరిలో ఉన్న మైక్ పెన్స్, కమలా హారిస్ మధ్య తొలి ముఖాముఖి డిబేట్ జరగడంపై ట్రంప్ స్పందించారు. కమలా హారిస్ ను కమ్యూనిస్ట్ నేతని అభివర్ణించారు.

"ఆమె వైస్ ప్రెసిడెంట్ అయితే, జో తన కుర్చీలో రెండు నెలలు కూడా కూర్చోలేడు. అది నా అభిప్రాయం" అని కరోనాకు చికిత్స చేయించుకుని వైట్ హౌస్ కు వచ్చిన తరువాత ఇచ్చిన తొలి ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆమె సోషలిస్టు కాదని, ఆమె అభిప్రాయాలను పరిశీలించిన ఎవరైనా, ఆమెను కమ్యూనిస్టనే చెబుతారని వ్యాఖ్యానించిన ట్రంప్, మన సరిహద్దులను తెరిచి, హంతకులను, కామాంధులను మన దేశంలోకి రప్పించాలని కోరుకుంటోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గత రాత్రి జరిగిన డిబేట్ కేవలం ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగినది కాదని, అది రెండు విభిన్న మనస్తత్వాల మధ్య జరిగిందని ట్రంప్ అభివర్ణించారు. అమెరికన్లపై మరిన్ని పన్నులు వేయాలని బైడెన్, హారిస్ భావిస్తున్నారని, వారు సరిహద్దులను తెరవాలని చూస్తున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టును మూసివేయాలని భావిస్తున్నారని, అదే వారిద్దరి అజెండా అని ట్రంప్ విమర్శలు గుప్పించారు.
Donald Trump
Kamala Harris
Mike Pence
Joe Biden

More Telugu News