మళ్లీ ఓడిన చెన్నై.. కోల్‌కతాదే విజయం!

08-10-2020 Thu 06:41
  • వాట్సాన్ మెరుపులు వృథా 
  • ఓ మాదిరి విజయ లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసిన ధోనీ సేన
  • రాహుల్ త్రిపాఠికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’
Kolkata knight riders defeat chennai super kings

కీలకమైన మ్యాచ్‌లో చెన్నై చతికిలపడింది. ఐపీఎల్‌లో భాగంగా నిన్న రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 168 పరుగుల ఓ మాదిరి విజయ లక్ష్యాన్ని ఛేదించలేక పరాజయం పాలైంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేసింది.

ఆరంభంలో షేన్ వాట్సన్ (40 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 50 పరుగులు), డుప్లెసిస్ (10 బంతుల్లో 3 ఫోర్లతో 17) దూకుడు చూసిన వారికి చెన్నై ఖాతాలో మరో విజయం ఖాయమని భావించారు. 30 పరుగుల వద్ద డుప్లెసిస్ వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన అంబటి రాయుడు కూడా బ్యాట్ ఝళిపించే ప్రయత్నం చేసినప్పటికీ క్రీజులో కుదురుకోలేకపోయాడు. 27 బంతుల్లో 3 ఫోర్లతో 30 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.

మరోవైపు, క్రీజులో నిలదొక్కుకున్న వాట్సాన్ మాత్రం జట్టును విజయం దిశగా నడిపించే ప్రయత్నం చేశాడు. అయితే, అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాక నరైన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికి జట్టు స్కోరు మూడు వికెట్ల నష్టానికి 101 పరుగులు. క్రీజులో ధోనీ ఉండడంతో చెన్నై అభిమానులు గెలుపుపై ధీమాగానే ఉన్నారు.

11 పరుగులు చేసిన ధోనీ, 17 పరుగులు చేసిన శామ్ కరన్ వెంటవెంటనే అవుట్ కావడంతో చెన్నై ఓటమి ఖరారైంది. చివర్లో రవీంద్ర జడేజా 8 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 21 పరుగులు చేసినప్పటికీ ఓటమి అంతరం తగ్గింది తప్పితే పరాజయం నుంచి జట్టును కాపాడలేకపోయాడు. కోల్‌కతా బౌలర్లలో శివమ్ మావీ, వరుణ్ చక్రవర్తి, కమలేశ్ నాగర్‌కోటి, సునీల్ నరైన్, రస్సెల్ చెరో వికెట్ తీసుకున్నారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా రాహుల్ త్రిపాఠి చలువతో నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌట్ అయింది. సహచరులు క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరుగుతున్నా త్రిపాఠి మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరును పెంచే ప్రయత్నం చేశాడు. 51 బంతులు ఎదుర్కొన్న త్రిపాఠి 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు.

మరోవైపు, కీలక మ్యాచ్‌లో చెలరేగిపోతారనుకున్న గిల్ (11), నితీశ్ రాణా (9), నరైన్ (17), రస్సెల్ (2) తీవ్రంగా నిరాశ పరిచారు.  కోల్‌కతా బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలుస్తున్న మోర్గాన్ (7) ఈసారి బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు వచ్చినప్పటికీ క్రీజులో కుదురుకోలేకపోయాడు. కెప్టెన్ కార్తీక్ (12) పేలవ ఫామ్ కొనసాగుతుండగా, కమిన్స్ 17 పరుగులు చేశాడు. నాగర్‌కోటి, శివమ్ మావీలు డకౌట్ అయ్యారు.  చెన్నై బౌలర్లలో బ్రావో మూడు వికెట్లు పడగొట్టగా, శామ్ కరన్, ఠాకూర్, కర్న్ శర్మ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 81 పరుగులు చేసి జట్టును ఆదుకున్న త్రిపాఠికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో కోల్‌కతా 6 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది.​​​​​