Brian Lara: కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, సంజూ శాంసన్ లో ఎవరు బెస్ట్?... దీనికి లారా సమాధానం ఇదిగో!

  • ధోనీ వారసుడిపై చర్చ
  • బలంగా వినిపిస్తున్న రాహుల్, శాంసన్, పంత్ ల పేర్లు
  • స్టార్ స్పోర్ట్స్ చానల్ కార్యక్రమంలో లారా వ్యాఖ్యలు
Batting maestro Brina Lara clarifies who is best to replace MS Dhoni

టీమిండియా వికెట్ కీపింగ్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ వారసుడు ఎవరు అన్నదానిపై చాన్నాళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. ఇటీవలే ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ చర్చ మరింత పెరిగింది. ధోనీ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్లుగా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, సంజూ శాంసన్ ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ ముగ్గురిలో బెస్ట్ ఎవరన్న ప్రశ్నకు విండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రయాన్ లారా సమాధానమిచ్చాడు.

ఎంతో బాధ్యతగా ఆడుతూ, ఓవైపు ఇన్నింగ్స్ చక్కదిద్దుతూనే, మరోవైపు పరుగులు సాధిస్తున్న ఢిల్లీ ఆటగాడు రిషబ్ పంత్ ఇలాగే రాణిస్తే నెంబర్ వన్ అవుతాడని కితాబిచ్చాడు. గతేడాది వరకు తాను పంత్ ఆటతీరు పట్ల సంతృప్తి కనబర్చేవాడ్ని కాదని, కానీ ఇప్పుడతడి ఆటతీరు మారిపోయిందని తెలిపాడు.

కేఎల్ రాహుల్ గురించి చెబుతూ, టీమిండియాకు వికెట్ కీపింగ్ చేయడాన్ని రాహుల్ ఎప్పుడూ భారం అనుకోడని, అతడు గొప్ప బ్యాట్స్ మన్ అని కొనియాడాడు. అయితే, రాహుల్ స్కోరుబోర్డుపై దృష్టి సారించి మరిన్ని పరుగులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.

సంజూ శాంసన్ పైనా లారా తన అభిప్రాయం పంచుకున్నాడు. ఐపీఎల్ లో రాజస్థాన్ జట్టుకు శాంసన్ కీపింగ్ చేయడంలేదని, కానీ కీపింగే శాంసన్ కు ప్రధానమైనదని స్పష్టం చేశాడు. శాంసన్ నాణ్యమైన ఆటగాడే అయినా, పదునైన బౌలింగ్ ను ఎదుర్కొనే క్రమంలో సాంకేతికంగా చిన్న పొరపాట్లు చేస్తున్నాడని లారా వివరించాడు. స్టార్ స్పోర్ట్స్ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో లారా ఈ వ్యాఖ్యలు చేశాడు.

More Telugu News