ఫేస్‌బుక్ సాయంతో భార్యాభర్తలను విడదీసిన యువకుడు.. మళ్లీ కలిపిన పోలీసులు!

07-10-2020 Wed 17:35
  • ఓ వివాహిత పేరుతో యువకుడి నకిలీ ఖాతా
  • ఆ వివాహిత స్నేహితులతో చాటింగ్‌
  • తన భర్త మంచివాడు కాదని వివాహిత పేరుతో మెసేజ్‌లు
  • గుర్తించి భార్యను పుట్టింటికి పంపిన భర్త
youngster arrested by police
పచ్చని కాపురంలో ఓ యువకుడు నిప్పులు పోశాడు. దీంతో భార్యాభర్తలు విడిపోయారు. చివరకు ఆ భార్యాభర్తలను కలిపిన పోలీసులు, ఆ కాపురాన్ని విడదీసిన యువకుడిని అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే... సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండల కేంద్రానికి చెందిన పెద్దింటి కిరణ్‌కుమార్‌ రెడ్డి అనే యువకుడు ఫేస్‌బుక్‌లో ఇతర అమ్మాయిల ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసుకుని వారి పేర్లతో ఫేస్‌బుక్‌ యూజర్లతో చాటింగ్ చేస్తుంటాడు.

ఇదే క్రమంలో ఓ వివాహిత పేరుతో ఓ నకిలీ ఖాతా తెరిచాడు. అనంతరం ఆమె ఖాతాలో ఉన్న స్నేహితులందరికీ కొత్త నకిలీ ఐడీతో ఫ్రెండ్‌ రిక్వెస్ట్ లు పంపి, వారితో చాటింగ్‌ చేస్తున్నాడు. ఆ వివాహితలా చాటింగ్‌ చేస్తూ తన భర్త మంచివాడు కాదంటూ ఎన్నో అసత్యాలు చెప్పాడు. చివరకు ఈ విషయం బాధితురాలి భర్తకు తెలిసింది.

తన భార్యే తన గురించి అందరికీ చెడుగా చెబుతోందని భావించాడు. ఆమెను రెండు నెలల క్రితం ఇంటి నుంచి పుట్టింటికి పంపించేశాడు. తానసలు ఈ మధ్య ఫేస్‌బుక్ వాడలేదని ఆమె చెప్పినప్పటికీ అత్తింటి వారు వినిపించుకోలేదు. చివరకు ఆ వివాహిత సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు ప్రారంభించి, అసలు విషయాన్ని గుర్తించారు.  కిరణ్‌కుమార్‌ రెడ్డి అనే యువకుడే ఆమె పేరిట ఖాతా తెరచి ఇలా చేశాడని తేల్చారు. ఆ భార్యాభర్తలను రమ్మని పిలిచి, ఈ గొడవ అంతటికి కిరణ్‌కుమార్ రెడ్డి కారణమని వివరించారు. దీంతో ఆ భార్యాభర్తలు తిరిగి ఒక్కటయ్యారు.