Raghu Rama Krishna Raju: దేవాలయాలు నిర్మించే బీజేపీ... ఆలయాలు కూల్చే వైసీపీతో కలుస్తుందా?: రఘురామకృష్ణరాజు

  • ఢిల్లీలో రఘురామ మీడియా సమావేశం
  • వైసీపీ నేతలు ఉత్తుత్తి కబుర్లు చెబుతున్నారన్న నరసాపురం ఎంపీ
  • హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే తాను సిద్ధమేనని వెల్లడి
Raghurama Krishna Raju press meet in Delhi

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై స్పందించారు. తాము కేంద్ర మంత్రులం అయిపోయామని వైసీపీ నేతలు ఉత్తుత్తి కబుర్లు చెబుతున్నారని, నవంబరులో కేంద్రమంత్రి వర్గ విస్తరణ వరకు వీళ్లు ఇలాగే చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. వీళ్లు చెప్పేవి అన్నీ అబద్ధాలేనని వచ్చే నెలలో తేలిపోతుందని ఎద్దేవా చేశారు.  

ఎవరితోనూ కలిసేది లేదని బీజేపీ స్పష్టంగా చెబుతోందని, కానీ వైసీపీ సొంత ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. దేవాలయాలు నిర్మించే పార్టీ అయిన బీజేపీ... ఆలయాలు కూల్చే వైసీపీతో కలుస్తుందా? అని ప్రశ్నించారు. ఆలయాలపై దాడులు చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోలేని జగన్... ఇప్పుడు బీజేపీతో కలవాలనుకుంటున్నారా? అని నిలదీశారు.

అయినా, వీళ్లను ఎన్డీయేలోకి రావాలని బతిమాలుకుంటున్నట్టు, అయితే వీరు ప్రత్యేకహోదా కోసం పట్టుబడుతున్నట్టు కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై సీఎం జగన్ కు అంత ప్రత్యేక అభిమానం ఉందా? అని ప్రశ్నించారు. హోదాపై చిత్తశుద్ధి ఉంటే కేంద్ర కేబినెట్ నుంచి బయటికి రావాలని అప్పట్లో టీడీపీని డిమాండ్ చేసింది ఎవరు అంటూ నిలదీశారు. హోదాపై తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటూ వైసీపీ ఎంపీలంతా రాజీనామాలు చేస్తే అందుకు తాను కూడా సిద్ధమేనని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు.

More Telugu News