Donald Trump: ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితి చూస్తే మరో డిబేట్‌ నిర్వహించకపోవడమే మంచిది: జో బైడెన్

  • అక్టోబరు 15న, గురువారం సాయంత్రం డిబేట్
  • డిబేట్‌లో పాల్గొంటానని ట్రంప్ ప్రకటన
  • ట్రంప్ పూర్తిగా కోలుకోకపోతే పాల్గొనబోనన్న బైడెన్
no debate with trump says biden

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా డెమోక్రటిక్ అభ్యర్థి బైడెన్‌తో తాను వచ్చేవారం పాల్గొనాల్సిన డిబేట్ పై స్పష్టతనిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. అక్టోబరు 15న, గురువారం సాయంత్రం మియామీలో జరిగే డిబేట్‌లో తాను పాల్గొంటానని ఆయన చెప్పారు. అయితే, ఆయనకు కరోనా సోకిన నేపథ్యంలో బైడెన్ ఈ విషయంపై స్పందించారు.  

ట్రంప్‌ కరోనా‌ నుంచి పూర్తిగా కోలుకోకపోతే ఆయనతో డిబేట్‌లో  పాల్గొననని చెప్పారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా రెండో డిబేట్‌ను నిర్వహించాలనుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితి చూస్తే ఇప్పుడు డిబేట్‌ నిర్వహించకపోవడమే మంచిదనిపిస్తోందని ఆయన తెలిపారు.

కాగా, ఆసుపత్రిలో కేవలం మూడు రోజులపాటు చికిత్స తీసుకున్న ట్రంప్ అనంతరం వైట్‌హౌస్‌కు వచ్చిన విషయం తెలిసిందే.  ఆయన ఆరోగ్యం పూర్తిస్థాయిలో బాగుందని వైద్యులు నిర్ధారించారు. అయినప్పటికీ ట్రంప్‌ సలహాదారులు, అధికారుల్లో చాలా మందికి కూడా కరోనా నిర్ధారణ అయింది. ఈ డిబేట్‌లో వాళ్లు కూడా పాల్గొనాల్సి ఉంటుంది. దీంతో దీనిపై సందిగ్ధత నెలకొంది.

More Telugu News