India: నేల చూపులు చూస్తున్న బంగారం, వెండి ధరలు!

  • వరుసగా రెండో రోజూ తగ్గుదల బాటలో
  • స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ ను పెంచిన ఫెడ్ ప్రకటన
  • ఈక్విటీ మార్కెట్లపై ఇన్వెస్టర్ల నజర్
Gold Prices Down in India and International Market

బంగారం ధరలు వరుసగా రెండో రోజూ తగ్గాయి. కరోనా కారణంగా నష్టపోయిన ఆర్థిక వ్యవస్థకు దన్నుగా సహాయక ప్యాకేజీని సిద్ధం చేస్తున్నామని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ పేర్కొనడంతో, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెరిగింది. దీంతో మార్కెట్లు లాభాల్లో పయనిస్తుండగా, బులియన్ పెట్టుబడులు ఈక్విటీలకు తరలుతున్నాయి. ఈ కారణంగానే విలువైన లోహాల ధరలు తగ్గుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్ తో పాటు, దేశవాళీ మార్కెట్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

కాగా, ప్రస్తుతం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో బంగారం ధర 10 గ్రాములకు రూ. 470 పడిపోయి రూ. 50,056కు చేరుకుంది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ కాగా, వెండి ధర సైతం రూ. 941 పడిపోయి రూ. 59,630కి తగ్గింది. ఇక స్పాట్ మార్కెట్లో బంగారం ధర రూ. 100 తగ్గగా, వెండి ధర ఏకంగా రూ. 1,370 పడిపోయింది. నిన్నటి ట్రేడింగ్ లో ఓ దశలో రూ. 62,300కు పైగా ఉన్న కిలో వెండి ధర రూ. 60,500కు చేరుకోవడం గమనార్హం.

ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1.2 శాతం తగ్గిపోయి, 1,887 డాలర్లకు చేరింది. ఇదే సమయంలో వెండి ధర 1.6 శాతం పడిపోయి 23.55 డాలర్లకు చేరుకుంది. సమీప భవిష్యత్తులోనూ బంగారం, వెండి ధరలు ఒడిదుడుకుల మధ్య సాగుతాయని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

More Telugu News