India: ముందు ఇది చెప్పండి.. రూ. 8,400 కోట్ల లగ్జరీ విమానాల సంగతేంటి?: ప్రధాని టార్గెట్ గా రాహుల్ విసుర్లు

  • సరిహద్దుల్లో చైనాతో ఇబ్బందులు
  • సైనికుల అవసరాలు తీర్చాల్సిన సమయం ఇది
  • ఇప్పుడు వేల కోట్లు పెట్టి లగ్జరీ విమానాలు ఎందుకు?
  • ట్రాక్టర్ పై ఆ కుషన్ ను అభిమానులు వేశారన్న రాహుల్
Rahul Asks Modi that Tractor Cussion is ok but what about Luxuary Flights

పంజాబ్ లో జరిగిన వ్యవసాయ బిల్లుల వ్యతిరేక ర్యాలీలో ఓ ట్రాక్టర్ పై కుషన్ సోఫా వేసుకుని కూర్చుని పాల్గొన్న రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించిన వేళ, రాహుల్ గాంధీ కూడా ప్రధాని మోదీ టార్గెట్ గా నిప్పులు చెరిగారు. ఇటీవల రూ. 8,400 కోట్ల వ్యయంతో రెండు అత్యాధునిక బోయింగ్ విమానాలను కేంద్రం కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, "ఆ విమానాల్లో కేవలం కుషన్ లు మాత్రమే ఉండవు. సుఖాన్నిచ్చే లగ్జరీ బెడ్లు ఉంటాయి" అని అన్నారు.

అంత డబ్బు పెట్టి ఈ విమానాలు కొనడం ఎందుకని ప్రశ్నించిన రాహుల్, సరిహద్దుల్లో చైనా మాటు వేసివుందని, తూర్పు లడఖ్ ప్రాంతంలో దశాబ్దాల తరువాత అతిపెద్ద ఆపరేషన్ మొదలైన వేళ, అక్కడి సైనికులకు శీతాకాల అత్యవసరాలు, ఆయుధాలు, మందుగుండు, ఆహారాన్ని పంపిస్తున్న సమయంలో, మోదీకి విమానాలు కావాల్సి వచ్చాయని సెటైర్లు వేశారు. మోదీ మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ కు ఇదే తరహా విమానం ఉందని, ఆయన్ను చూసి మోదీ కూడా తయారు చేయించుకున్నారని విమర్శించారు.

"మీరంతా దీని గురించి ఎందుకు ప్రశ్నించరు? ఇటీవల కొన్న బోయింగ్ 777 గురించి ఎవరూ అడగటం లేదు. చిన్న సోఫాను వేసుకున్నందుకు ప్రతి ఒక్కరూ వేలెత్తి చూపుతున్నారు" అని తన మూడు రోజుల ర్యాలీలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ రాహుల్ మండిపడ్డారు. తన అభిమానులు ఆ సోఫాను తెచ్చి ట్రాక్టర్ పై వేశారని వెల్లడించిన రాహుల్, అది లేకున్నా తాను ర్యాలీలో పాల్గొని ఉండేవాడినని, మోదీ మాత్రం ఈ లగ్జరీ విమానాలు కొనకుండా ఉండేవారు మాత్రం కాదని అన్నారు.

రాహుల్ ఈ విమర్శలు చేయగానే, కేంద్ర నేతలు స్పందించారు. దేశంలోని వీవీఐపీల అవసరాల నిమిత్తం అధునాతన విమానాలు కొనాలన్న నిర్ణయం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకున్నదేనని, ఆ విమానాలు ఇప్పుడు వచ్చాయని విమర్శించారు. ఈ విమానాలను కేవలం మోదీ మాత్రమే వాడబోవడం లేదని, చాలా మంది వీవీఐపీల ప్రయాణ అవసరాలను ఇవి తీరుస్తాయని అన్నారు.

More Telugu News