Apex Council: వాడీవేడిగా అపెక్స్ కౌన్సిల్ సమావేశం... జగన్, కేసీఆర్ మధ్య వాదోపవాదాలు!

  • జల వివాదాల పరిష్కారం కోసం అపెక్స్ కౌన్సిల్ భేటీ
  • హాజరైన తెలుగు సీఎంలు
  • లేఖల రూపంలో వివరాలు సమర్పించిన సీఎం జగన్
  • అభ్యంతరాలు తెలిపిన తెలంగాణ సీఎం
Heated arguments between Telugu chief ministers at Apex Council meet

తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుల విషయంలో నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం ఇవాళ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు.

 ఈ భేటీలో పాల్గొన్న సీఎం జగన్ కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు లేఖల రూపంలో వివరాలు సమర్పించారు. జగన్ లేవనెత్తిన అంశాలపై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగినట్టు తెలిసింది.

రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు శ్రీశైలం నీరే ఆధారమని సీఎం జగన్ తన లేఖల్లో తెలిపారు. థార్ ఎడారి తర్వాత అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం అనంతపురం జిల్లాయేనని వివరించారు. ఎడారి అభివృద్ధి పథకం కూడా అనంతపురం జిల్లాలో అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలు దుర్భిక్ష ప్రాంతాల అభివృద్ధి పథకంలో ఉన్నాయని తన లేఖల్లో నివేదించారు.

దుర్భిక్ష జిల్లాలకు 50 టీఎంసీల చొప్పునే ఇవ్వగలుగుతున్నామని, ఈ జిల్లాల్లో సాగు, తాగునీటి ఎద్దడి తీరాలంటే 100 టీఎంసీలు సరఫరా చేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ అంశాలపై గతేడాది జూన్ లో జరిగిన భేటీలో కేసీఆర్ అంగీకారం తెలిపారని వెల్లడించారు. శ్రీశైలంలో 854 అడుగుల కంటే ఎక్కువ ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించగలమని, 44 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో ఏడాదికి 15 రోజులే ఎత్తిపోసే అవకాశం ఉందని వివరించారు.

తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, గాలేరు-నగరి శ్రీశైలం ప్రాజెక్టుపైనే ఆధారపడ్డాయని... సోమశిల, కండలేరు, వెలిగొండ, హంద్రీనీవా, చిత్రావతికి కూడా శ్రీశైలమే ఆధారమని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టులు శ్రీశైలం నీటిపైనే ఆధారపడ్డాయని, కానీ, తెలంగాణ కొత్తగా పాలమూరు, డిండి, రంగారెడ్డి, కల్వకర్తి ప్రాజెక్టులు నిర్మించిందని వెల్లడించారు.

కాళేశ్వరం మూడో టీఎంసీ ఎత్తిపోతలకు అనుమతులు లేవని జగన్ ఎత్తిచూపారు. జగన్ వ్యాఖ్యలపై అసహనానికి గురైన సీఎం కేసీఆర్ పోతిరెడ్డిపాడుకు అసలు ఏ అనుమతులు లేవని ప్రత్యారోపణలు చేశారు. మొదటి ప్రాజెక్టుకు అనుమతి లేకపోతే రెండో ప్రాజెక్టు ఎలా చేపడతారని ప్రశ్నించారు. దాంతో కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ జోక్యం చేసుకుని తెలుగు సీఎంలకు సర్దిచెప్పారు. డీపీఆర్ లు సమర్పిస్తే అన్ని ప్రాజెక్టులపై కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒప్పించారు.

More Telugu News