Rohit Sharma: ఎందుకొచ్చిన రిస్కనేమో... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ!

  • ఈసారి ఐపీఎల్ లో ప్రభావం చూపని టాస్
  • సేఫ్ గేమ్ కోసం ముంబయి ఇండియన్స్ ప్రయత్నం
  • భారీస్కోరు సాధించి ప్రత్యర్థిని ఒత్తిడికి గురిచేయాలని ప్లాన్
Rohit Sharma won the toss and elected to bat first against Rajasthan Royals

ఈసారి ఐపీఎల్ టోర్నీలో మ్యాచ్ ఫలితాలు ఏమాత్రం ఊహించనలవి గాకుండా ఉన్నాయి. టాస్ గెలిచి ఎంతో వ్యూహాత్మకంగా మొదట ఫీల్డింగ్ తీసుకుంటున్న జట్లకు ఏమంత కలిసిరావడంలేదు. చేజేతులా ఛేజింగ్ ఎంచుకుని, ఆపై ఒత్తిడికి చిత్తవుతున్నారు. కొండలా పెరిగిపోతున్న రన్ రేట్ అందుకోలేక లక్ష్యానికి బారెడు దూరంలో చతికిలబడుతున్నారు. టాస్ గెలిచి కూడా మ్యాచ్ లను కోల్పోయిన సందర్భాలున్నాయి.

అందుకేనేమో ముంబయి ఇండియన్స్ జట్టు సారథి రోహిత్ శర్మ నేడు రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో టాస్ గెలిచి మరేమీ ఆలోచించకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదట భారీ స్కోరు సాధించి, ఆపై ప్రత్యర్థిని ఒత్తిడి చట్రంలో బిగించాలన్నది రోహిత్ టీమ్ ప్లాన్.

ఇక రెండు జట్ల విషయానికొస్తే, కార్తీక్ త్యాగి రాజస్థాన్ రాయల్స్ తుదిజట్టుకు ఎంపికయ్యాడు. ఐపీఎల్ లో అతడికిదే తొలి మ్యాచ్. ముంబయి టీమ్ మాత్రం తమ అచ్చొచ్చిన కూర్పును మార్చడంలేదు. గత మ్యాచ్ లో ఆడిన జట్టునే బరిలో దింపుతోంది. పాయింట్ల పట్టికలో ముంబయి ఇండియన్స్ రెండో స్థానంలో ఉండగా, రాజస్థాన్ రాయల్స్ ఐదో స్థానంలో ఉంది.

More Telugu News