Uttar Pradesh: హత్రాస్ మృతురాలి అంత్యక్రియలపై సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చిన యూపీ సర్కారు

  • హత్రాస్ లో దళిత యువతిపై పైశాచిక దాడి
  • చికిత్స పొందుతూ సెప్టెంబరు 29న యువతి మృతి
  • అర్ధరాత్రి మృతదేహన్ని దహనం చేసిన పోలీసులు
Uttar Pradesh government explains Supreme Court why they had cremated Dalith woman

ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో ఓ దళిత యువతిపై పాశవిక దాడి జరగడం, ఆమె చికిత్స పొందుతూ మృతి చెందడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహజ్వాలలు రగిల్చింది. దానికితోడు, అర్ధరాత్రి వేళ కుటుంబ సభ్యులు ఎవరూ లేకుండానే ఆ యువతి మృతదేహానికి పోలీసులు దహన సంస్కారాలు నిర్వహించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఈ పరిణామంపై యూపీ సర్కారు సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది. తాము అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వెల్లడించింది.

హత్రాస్ లో దాడికి గురైన 19 ఏళ్ల అమ్మాయి ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబరు 29న మృతి చెందింది. అయితే, ఆమె చికిత్స పొందిన సఫ్దర్ జంగ్ ఆసుపత్రి వద్ద జరిగిన ధర్నా తరహాలోనే మరిన్ని అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి తమకు సమాచారం అందిందని యూపీ సర్కారు సుప్రీంకు తెలిపింది.

ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం... ఈ వ్యవహారానికి కులం, మతం అంశాలను ఆపాదించి కొన్ని స్వార్థపూరిత శక్తులు లాభపడేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసిందని, ఇలాంటి విపరిణామాలు చోటుచేసుకోకుండా ఉండేందుకే తాము ఆ యువతి మృతదేహానికి అత్యవసరంగా అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చిందని వివరించింది.

యువతి మరణించిన మరుసటిరోజు భారీ స్థాయిలో హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని తెలియడంతో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని యూపీ సర్కారు స్పష్టం చేసింది.

More Telugu News