చిరంజీవి తదుపరి సినిమా.. బ్యాక్ డ్రాప్ అదేనా?

06-10-2020 Tue 12:26
  • కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో గతంలో 'చూడాలని ఉంది'
  • మెహర్ రమేశ్ దర్శకత్వంలో 'వేదాళం' రీమేక్
  • కోల్ కతా నగరానికి, కథకు మంచి సంబంధం
  • 'ఆచార్య' తర్వాత 'లూసిఫర్'తో పాటు సెట్స్ కి    
Chiranjivis next film in Kolkata backdrop
చిరంజీవి, సౌందర్య జంటగా గుణశేఖర్ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'చూడాలని ఉంది' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ చిత్రం కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. దాంతో చిత్రంలోని పలు సన్నివేశాలను, ఓ పాటను కోల్ కతా నగరంలో చిత్రీకరించారు కూడా. ఇక ఇప్పుడు మళ్లీ చిరంజీవి కోల్ కతా నేపథ్యంలో మరో చిత్రాన్ని చేస్తున్నారు.

అజిత్ హీరోగా తమిళంలో వచ్చిన 'వేదాళం' చిత్రాన్ని చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. మెహర్ రమేశ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రకథ కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని తెలుస్తోంది. కోల్ కతా నగరానికి, చిత్రకథకు మధ్య మంచి సంబంధం వుంటుందట. మరి, షూటింగులో కొంత భాగం అక్కడ చేస్తారో లేదో ఇంకా వెల్లడి కాలేదు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో చిరంజీవి చెల్లెలు పాత్రలో కథానాయిక సాయిపల్లవి నటిస్తుందని అంటున్నారు. మణిశర్మ తనయుడు సాగర్ దీనికి సంగీతం సమకూరుస్తాడని సమాచారం. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న 'ఆచార్య' చిత్రం పూర్తయ్యాక, ఈ 'వేదాళం' రీమేక్ తో పాటు, 'లూసిఫర్' రీమేక్ కూడా సెట్స్ కి వెళుతుంది.