Chirag Falor: జేఈఈ టాపర్ గా నిలిచినా... ఐఐటీలో చేరనంటున్న పూణె యువకుడు!

  • ఏఐఆర్ 12 ర్యాంకును పొందిన చిరాగ్ ఫాలోర్
  • ప్రస్తుతం యూఎస్ ఎంఐటీలో విద్య
  • ఎంఐటీలోనే కొనసాగుతానన్న చిరాగ్
JEE Toper Chirag Dont want IIT

జేఈఈ అడ్వాన్డ్స్ పరీక్షల్లో టాపర్ గా నిలిచిన ఓ కుర్రాడు, తాను ఐఐటీలో చేరబోనని అంటున్నాడు. సోమవారం నాడు ప్రకటించిన పరీక్షా ఫలితాల్లో పూణెకు చెందిన చిరాగ్ ఫాలోర్ కు ఆల్ ఇండియా ర్యాంక్ 12 వచ్చింది. దీంతో దేశంలోని ఏ ఐఐటీలోనైనా అతను కోరుకున్న బ్రాంచిలో సీటు గ్యారంటీగా లభిస్తుంది. అయితే, తాను ఐఐటీలో చేరాలని భావించడం లేదని, యూఎస్ లోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లోనే చదువుతానని అంటున్నాడు.

ఈ సంవత్సరం జేఈఈ అడ్వాన్డ్స్ పరీక్షలకు 1.60 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 1.50 లక్షల మంది వరకూ హాజరయ్యారు. వీరిలో 6,707 మంది అమ్మాయిలు సహా, 43 వేల మంది ఉత్తీర్ణులయ్యారు.

ఇదిలావుంచితే, గత మార్చిలో తాను ఎంఐటీలో ప్రవేశాన్ని పొందానని, కరోనా కారణంగా ఆన్ లైన్ క్లాసులు మాత్రమే జరుగుతున్నాయని, తాను ఎంఐటీలోనే కొనసాగుతానని చిరాగ్ స్పష్టం చేశాడు.

కాగా, ఈ పరీక్షల్లో మొత్తం 396 మార్కులకు గాను చిరాగ్ కు 352 మార్కులు వచ్చాయి. ఐఐటీ సాధించాలన్న కసితో దాదాపు నాలుగేళ్ల పాటు శ్రమించానని చెప్పిన చిరాగ్, ఈ పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలంటే, ఎంతో కష్టపడాలని అన్నాడు.

అయితే, ఎంఐటీ మాత్రం అభ్యర్థి పర్సనాలిటీ, సామర్థ్యాన్ని అంచనా వేసి, విద్యార్థులను ఎంపిక చేస్తుందని గుర్తు చేశాడు. అవకాశాలను విద్యార్థులు ఏ మేరకు అందుకుంటారన్న విషయాన్ని మాత్రమే ఎంఐటీ పరిశీలిస్తుందని అన్నాడు. తాను రాత్రిపూట ఎంఐటీ క్లాసులకు అటెండ్ అవుతూనే ఐఐటీకి కూడా ప్రిపేర్ అయ్యానని చెప్పాడు. వచ్చే సంవత్సరం జనవరిలో యూఎస్ కు వెళ్లి ఎంఐటీ విద్యను కొనసాగిస్తానని స్పష్టం చేశాడు.

More Telugu News