SMART: సాగర గర్భంలో శత్రువు పనిబట్టే 'స్మార్ట్' అస్త్రం... విజయవంతంగా పరీక్షించిన భారత్!

  • చైనా సబ్ మెరైన్లకు చెక్ పెట్టే సరికొత్త ఆయుధం
  • ఎక్కడ దాక్కున్నా వెతికి ఢీకొట్టే స్మార్ట్
  • క్షిపణికి టార్పెడోను జోడించిన డీఆర్డీవో
India test fires SMART missile torpedo successfully

గత కొన్నినెలలుగా చైనాతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఉన్న నేపథ్యంలో భారత్ తన ఆయుధ పాటవాన్ని మరింత పెంచుకుంటోంది. ముఖ్యంగా, హిందూ మహాసముద్రంలో పాగా వేయాలని చూస్తున్న చైనాను నిలువరించడంపై భారత్ దృష్టి సారించింది. అంతర్జాతీయ వాణిజ్యానికి ఎంతో కీలకమైన హిందూ మహాసముద్రంపై పట్టుకోసం ప్రయత్నిస్తున్న చైనా అనేక జలాంతర్గాములను మోహరిస్తోంది.

ఈ సబ్ మెరైన్లను గుర్తించిన వెంటనే తుత్తునియలు చేసే వ్యవస్థ ఇప్పటివరకు భారత్ వద్ద లేదు. అయితే ఆ లోటు తీరుస్తూ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) తాజాగా 'స్మార్ట్' (సూపర్ సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో) అనే అస్త్రాన్ని తయారుచేసింది.

ఇది ఒక యాంటీ సబ్ మెరైన్ ఆయుధం. ఓ బాలిస్టిక్ క్షిపణి, టార్పెడో కలయికనే 'స్మార్ట్' గా పేర్కొనవచ్చు. దీన్ని యుద్ధ నౌకల నుంచి గానీ, తీర ప్రాంతాల్లో నిలిపి ఉంచిన మొబైల్ లాంచర్ ద్వారా గానీ ప్రయోగించవచ్చు. మొదట ఈ 'స్మార్ట్' మిసైల్ గాల్లో ప్రయాణిస్తుంది. సముద్రంలో ఉన్న జలాంతర్గామిని గుర్తించగానే, గగనతలం నుంచి దానికి అత్యంత సమీపానికి వెళుతుంది. ఆపై మిసైల్ నుంచి టార్పెడో వెలువడుతుంది. ఈ టార్పెడో సముద్ర జలాల్లోకి ప్రవేశించి సాగరగర్భంలో దాగివున్న శత్రుదేశ జలాంతర్గామిని నాశనం చేస్తుంది.

'స్మార్ట్' చాలా దగ్గరగా వచ్చిన తర్వాత టార్పెడోను రిలీజ్ చేస్తుంది కాబట్టి, జలాంతర్గామికి దీన్ని గుర్తించే అవకాశం కానీ, తప్పించుకునే అవకాశం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవు. ఈ హైబ్రిడ్ ఆయుధం సముద్ర జలాల్లో గంటకు 50 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. దీని రేంజ్ 600 కిమీ. తాజాగా ఈ 'స్మార్ట్' అస్త్రాన్ని ఒడిశా తీరం నుంచి విజయవంతంగా పరీక్షించి చూశారు.

ఇప్పటివరకు ఇలాంటి వ్యవస్థలు అమెరికాతో పాటు రష్యా, చైనాల వద్దే ఉన్నాయి. ఇప్పుడు వాటి సరసన భారత్ కూడా చేరింది. అయితే, చైనా వద్ద ఉన్న 'స్మార్ట్' తరహా ఆయుధ వ్యవస్థలో టార్పెడో సామర్థ్యం పరిమితం. భారత్ వద్ద ఉన్న టార్పెడో శక్తి మరింత ఎక్కువ అని డీఆర్డీవో నిపుణులు అంటున్నారు.

More Telugu News