Politicians: ప్రజాప్రతినిధులపై 4859 కేసుల పెండింగ్.. ఏపీలో 132, తెలంగాణలో 143 కేసులు!

  • సుప్రీంకోర్టుకు కార్యాచరణ ప్రణాళిక అందించిన అమికస్ క్యూరీ
  • అత్యధిక కేసులతో తొలి స్థానంలో యూపీ
  • కేసుల పురోగతిపై కేంద్రం నివేదిక ఇవ్వాలని సూచన
4859 cases of political leaders are in pending

ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను త్వరితగతిన విచారించేందుకు సుప్రీంకోర్టు కార్యాచరణ రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి సలహాలు ఇవ్వాలంటూ అన్ని రాష్ట్రాల హైకోర్టులను సుప్రీం కోరింది.

మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని హైకోర్టులు ప్రజాప్రతినిధుల కేసుల వివరాలను అందించాయి. ఈ వివరాలను అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఈ నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై 4,859 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అత్యధిక కేసులతో ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో, రెండో స్థానంలో బీహార్ ఉన్నాయి.

ఏపీలో 132, తెలంగాణలో 143 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఏపీ విషయానికి వస్తే 10 కేసులు సెషన్స్ కోర్టుల్లో, 122 కేసులు మేజిస్ట్రేట్ స్థాయి కోర్టుల్లో ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ ప్రత్యేక కోర్టులో 118 కేసులు, సీబీఐ, ఇతర కోర్టుల్లో 25 కేసులు ఉన్నాయి.

ప్రతి జిల్లాలో ఒక మేజిస్ట్రేట్ కోర్టును ప్రత్యేక కోర్టుగా గుర్తిస్తామని ఏపీ హైకోర్టు తన కార్యాచరణ ప్రణాళికలో తెలిపింది. విశాఖ, కడపలో సెషన్స్ స్థాయి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది.

కరీంనగర్, మహబూబ్ నగర్ లలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని తెలంగాణ హైకోర్టు ప్రతిపాదించింది. సీబీఐ ప్రధాన కోర్టులో ఉన్న 17 కేసులు 9 నెలల్లో ముగిసే దశలో ఉన్నట్టు తెలిపింది. 11 కేసుల్లో సీబీఐ, 5 కేసుల్లో ఈడీ ఛార్జిషీట్లను దాఖలు చేశాయని వెల్లడించింది. కేసుల పురోగతి, విచారణ కోసం ప్రత్యేక వెబ్ సైట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది.

ఈ సందర్బంగా సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ ఒక విన్నపం చేశారు. కేసుల పురోగతిపై నివేదిక సమర్పించేలా కేంద్రాన్ని ఆదేశించాలని చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీల కేసుల పురోగతిపై నివేదిక అందించాలని అన్నారు. ప్రజాప్రతినిధుల కేసుల విచారణతో పాటు, దర్యాప్తును కూడా హైకోర్టులు పర్యవేక్షించాలని చెప్పారు.

నోడల్ ప్రాసిక్యూషన్ అధికారులను, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను రాష్ట్ర ప్రభుత్వాలు నియమించాలని విన్నవించారు. సాక్షుల విచారణకు ప్రత్యేక కోర్టుల్లో భద్రమైన గది ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించాారు. సాక్షుల సంరక్షణ చట్టం 2018ని ప్రత్యేక కోర్టులు అమలు చేసేలా ఆదేశాలివ్వాలని అన్నారు.

More Telugu News