Punjab: చెన్నై ఓపెనర్ల ధనాధన్.. చిత్తుగా ఓడిన పంజాబ్

  • 179 పరుగుల విజయ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన చెన్నై
  • పంజాబ్ పేలవ బౌలింగ్
  • నాలుగు ఓటములతో అట్టడుగున పంజాబ్ జట్టు
Chennai Super Kings defeat KingsXIPunjab

పంజాబ్ సూపర్ కింగ్స్‌తో దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్ 18వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. వరుస ఓటములతో కుంగిపోయిన జట్టు ఈసారి చెలరేగింది. పంజాబ్ నిర్దేశించిన 179 పరుగుల విజయ లక్ష్యాన్ని ఓపెనర్లే బాదేశారు. షేన్ వాట్సన్, ఫా డుప్లెసిస్‌లు చెలరేగి ఆడారు. పోటాపోటీగా పరుగులు తీస్తూ పంజాబ్ బౌలర్లను ముప్పుతిప్పులు పెట్టారు. వీరి భాగస్వామ్యాన్ని విడదీసేందుకు పంజాబ్ కెప్టెన్ మార్చిమార్చి బౌలర్లను ప్రయోగించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఏమాత్రం ప్రభావం చూపని బౌలర్లు పరుగులు ధారాళంగా సమర్పించుకున్నారు. వికెట్లు తీసేందుకు చెమటోడ్చినా ఫలితం లేకుండా పోయింది.

పొరపాట్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వని వాట్సన్, డుప్లెసిస్‌లు సమయోచితంగా ఆడుతూ జట్టుకు ఘన విజయం అందించారు. వాట్సన్ 53 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 83 పరుగులు చేయగా, డుప్లెసిస్ 53 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌తో 87 పరుగులు చేశాడు. దీంతో చెన్నై జట్టు మరో రెండు ఓవర్ల రెండు బంతులు మిగిలి ఉండగానే వికెట్ కోల్పోకుండా విజయాన్ని అందుకుంది. 5 మ్యాచ్‌లు ఆడిన చెన్నైకి ఇది రెండో విజయం.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ శుభారంభాన్ని ఇచ్చారు. రాహుల్ జోరుతో జట్టు స్కోరు ఒక దశలో 200 దాటుతుందని భావించినప్పటికీ చివర్లో చెన్నై బౌలర్లు కట్టడి చేశారు.

రాహుల్ 52 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 63 పరుగులు చేయగా, మయాంక్ 26, మన్‌దీప్ 27, పూరన్ 33 పరుగులు చేశారు. మ్యాక్స్‌వెల్ 11, సర్ఫరాజ్ ఖాన్ 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. చెన్నై బౌలర్లలో ఠాకూర్‌ రెండు వికెట్లు పడగొట్టగా, జడేజా, చావ్లా చెరో వికెట్ తీసుకున్నారు. షేన్ వాట్సన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

More Telugu News