ముంబయి పకడ్బందీ బౌలింగ్... లక్ష్యఛేదనలో సన్ రైజర్స్ విఫలం

04-10-2020 Sun 19:37
  • 34 పరుగుల తేడాతో ముంబయి చేతిలో ఓటమి
  • ముంబయి 20 ఓవర్లలో 208/5
  • సన్ రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 174 రన్స్
Sunrisers Hyderabad lost to Mumbai Indians in Sharjah

షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ 34 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ముంబయి విసిరిన 209 పరుగుల లక్ష్యఛేదనలో సన్ రైజర్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 174 పరుగులు మాత్రమే చేసింది.

ఓ దశలో గెలుపు దిశగా సాగుతున్నట్టు అనిపించిన సన్ రైజర్స్ కీలక దశలో వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (44 బంతుల్లో 60; 5 ఫోర్లు, 2 సిక్సులు) రాణించాడు. బెయిర్ స్టో (15 బంతుల్లో 25), మనీష్ పాండే (19 బంతుల్లో 30) ఫర్వాలేదనిపించినా భారీస్కోర్లు నమోదు చేయలేకపోయారు. కేన్ విలియమ్సన్ (3), ప్రియమ్ గార్గ్ (8) విఫలం కావడం విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది.

చివరి వరుస బ్యాట్స్ మన్ పోరాడేందుకు ప్రయత్నించినా, బుమ్రా, బౌల్ట్, పొలార్డ్ ల కట్టుదిట్టమైన బౌలింగ్ తో వారు స్వేచ్ఛగా బ్యాట్లు ఝుళిపించలేకపోయారు.