MS Dhoni: మైదానంలో అంతలా ఎందుకు దగ్గానంటే..: ఎంఎస్ ధోనీ!

  • ధోనీ క్రీజులో ఉన్నా సీఎస్కే పరాజయం
  • చివరి ఓవర్లలో తీవ్రంగా దగ్గుతూ కనిపించిన ధోనీ
  • పొడి వాతావరణంతో తన గొంతు డ్రైగా మారిందని వెల్లడి
  • గెలుపు కోసం బలంగా బంతిని బాదలేకపోయానన్న ధోనీ
Dhoni Told the Reason Why He Cough Too Much in Stadium

ఎన్నో మ్యాచ్ లను ఒంటిచేత్తో గెలిపించిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మొన్నటి సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం, చివరి వరకూ క్రీజులో ఉండి కూడా ఆ పని చేయలేకపోయాడు. అసాధ్యం కాని  లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన ధోనీ సేన 2014 తరువాత వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిపోవడం ఇదే తొలిసారి.

చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఓడిపోయిన మాట పక్కన ఉంచితే, ధోనీ, 35 బంతుల్లో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచి కూడా జట్టును గెలిపించలేక పోయాడన్నది అభిమానుల్లో చర్చనీయాంశంకాగా, చివరి రెండు ఓవర్లలో ధోనీ, చాలా దగ్గుతూ కనిపించడం అభిమానులను తీవ్రంగా కలవర పెట్టింది. రవీంద్ర జడేజాతో కలిసి జట్టును విజయతీరాల దిశగా తీసుకెళ్లిన ధోనీ, చివరి 20 నిమిషాల్లో మాత్రం తీవ్రంగా అలసిపోయాడు.

విపరీతంగా దగ్గుతూ కనిపించి, పరుగుల వేగాన్ని తగ్గించాడు. ఫలితంగా ఆ జట్టు ఓడిపోయింది. తాజాగా, దీనిపై స్పందించిన ధోనీ, తాను మైదానంలో ఎందుకలా దగ్గుతూ ఉన్నానన్న విషయాన్ని తెలిపాడు. మ్యాచ్ జరిగిన దుబాయ్ లో పొడి వాతావరణం అధికమని, అందువల్లే తన గొంతు పూర్తిగా డ్రై అయిపోయిందని చెప్పాడు. అక్కడి వాతావరణ పరిస్థితి కారణంగానే తన పరిస్థితి అలా మారిందని, గెలుపుకోసం బంతిని బలంగా బాదడం కష్టమైందని అన్నాడు.

ఇదే సమయంలో జట్టులోని ఇతర క్రికెటర్లు క్యాచ్ లను జారవిడుస్తున్నారని, బౌలర్లు నో బాల్స్ వేస్తూ, స్కోరును పెంచుతున్నారని, ఇటువంటి తప్పుల వల్లే మ్యాచ్ ల్లో ఓడిపోతున్నామని చెప్పిన ధోనీ, తదుపరి మ్యాచ్ లలో ఈ తప్పులు జరగకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు.

More Telugu News