షార్జాలో అయ్యర్, షా విధ్వంసం, పంత్ మెరుపులు... కోల్ కతా ముందు భారీ టార్గెట్

03-10-2020 Sat 21:43
  • షార్జాలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్
  • మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
  • 20 ఓవర్లలో 4 వికెట్లకు 228 పరుగులు
Delhi Capitals set huge target before Kolkata Knight Riders

అనుకున్నదే అయ్యింది! చిన్నదైన షార్జా స్టేడియంలో పరుగుల వెల్లువ ఖాయమని అందరూ భావించిందే నిజమైంది. ఐపీఎల్ లో భాగంగా ఇవాళ షార్జాలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా, మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు వీరబాదుడు బాదింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 228 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 38 బంతుల్లోనే 88 పరుగులు చేయడం విశేషం. అయ్యర్ స్కోరులో 7 ఫోర్లు, 6 సిక్సులున్నాయి. అయ్యర్ మైదానం నలుమూలలా బంతిని బాదుతూ కోల్ కతా బౌలర్లకు చుక్కలు చూపించాడు. మొదట్లో ఓపెనర్ పృథ్వీషా కూడా ధాటిగా ఆడాడు. షా 41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 66 పరుగులు సాధించాడు. చివర్లో చిచ్చరపిడుగు రిషబ్ పంత్ 17 బంతుల్లో 38 పరుగులు రాబట్టాడు. పంత్ 5 ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు.