Mamata Banerjee: ఈవేళ నేను హిందువుని కాదు.. దళితురాలిని.. రేపు హత్రాస్ వెళుతున్నా: మమతా బెనర్జీ గర్జన

  • ఈ దేశానికి పట్టిన అతిపెద్ద మహమ్మారి బీజేపీ
  • బీజేపీ ప్రభుత్వాలు దళితులు, మైనార్టీలను టార్చర్ పెడుతున్నాయి
  • అధ్యక్ష పాలన దిశగా ముందుకు సాగుతున్నారు
Iam not Himdu Iam Dalit says Mamata Banerjee

యూపీలోని హత్రాస్ లో చోటుచేసుకున్న యువతి హత్యాచారంపై యావత్ దేశం అట్టుడుకుతోంది. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 'హత్రాస్ హర్రర్' పేరుతో కోల్ కతాలో నిరసన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీని టార్గెట్ చేశారు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో దళితులు, మైనార్టీలు, రైతులను టార్చర్ చేస్తున్నారని మండిపడ్డారు. నిరంకుశ ధోరణితో పాలన సాగిస్తున్నారని అన్నారు.

కరోనా అనేది ఒక మహమ్మారి అయితే... బీజేపీ అనేది ఈ దేశానికి పట్టిన అతి పెద్ద మహమ్మారి అని దీదీ విమర్శించారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి చేసే ప్రతి ప్రయత్నానికి తాను మద్దతు పలుకుతానని చెప్పారు. బాధిత కుటుంబాన్ని మేము కలవకుండా మీ పోలీసులు అడ్డుకుంటారని మీరు అనుకుంటున్నారా? అని బీజేపీని ప్రశ్నించారు. రేపు తాను బాధిత కుటుంబాన్ని కలుస్తున్నానని... మీరు కనీసం గుర్తించలేరని అన్నారు. హత్రాస్ కుమార్తె తమకు కూడా కూతురేనని చెప్పారు. దళితులు, మైనార్టీలకు మద్దతుగా మనం ఉంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. ఈరోజు తాను హిందువును కానని, ఒక దళిత మహిళనని చెప్పారు.

మనసులో దుర్మార్గపు ఆలోచనలు పెట్టుకుని, బీజేపీ చాలా గొప్పగా మాట్లాడుతోందని మమత అన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు దళితుల ఇళ్లకు వెళతారని... భోజనాన్ని బయట నుంచి తెప్పించుకుని, దళితుల ఇంట్లో భోజనం చేశామని చెప్పుకుంటారని విమర్శించారు. ఎన్నికల తర్వాత దళితులను టార్చర్ పెడతారని అన్నారు.

దేశం సిగ్గుపడేలా బీజేపీ వ్యవహరిస్తోందని మమత మండిపడ్డారు. ఒక కూతురు విషయంలో జరిగినదానికి బీజేపీ సిగ్గుపడాలని అన్నారు. ఫోన్ ద్వారా హత్రాస్ బాధిత కుటుంబంతో తాను మాట్లాడాలనుకున్నానని... అయితే, ఫోన్ ని కూడా వారి నుంచి లాక్కున్నారని దుయ్యబట్టారు. మైనార్టీల సంక్షేమం గురించి మాట్లాడితే... ముస్లింలను సంతృప్తిపరిచేందుకు మాట్లాడుతున్నారనే ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతి కేసు నేపథ్యంలో ముంబైలో డ్రామా చూశామని... తమకు డ్రామా అవసరం లేదని, దళితులకు న్యాయం కావాలని అన్నారు.

అధ్యక్ష తరహా పాలన దిశగా ముందుకు సాగుతున్నారని... దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేస్తున్నారని మమత మండిపడ్డారు. దేశంలో ఉన్న ప్రస్తుత మహా పురుషుడు నేతాజీ, గాంధీ, ఠాగూర్, అంబేద్కర్, భగత్ సింగ్ కాదని అన్నారు. దేశ భవిష్యత్తు బీజేపీ ఎంత మాత్రం కాదని... బీజేపీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు.

More Telugu News