Virat Kohli: ముందుండి నడిపించిన కెప్టెన్ కోహ్లీ... బెంగళూరు జట్టుకు మరో విక్టరీ

Royal Challengers Banglore won against Rajasthan Royals
  • రాజస్థాన్ పై 8 వికెట్లతో బెంగళూరు విజయం
  • కోహ్లీ 72 నాటౌట్
  • మరోసారి అలరించిన పడిక్కల్ 
కెప్టెన్ విరాట్ కోహ్లీ (53 బంతుల్లో 72 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సులు) సమయోచితంగా రాణించడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తాజా ఐపీఎల్ సీజన్ లో మరో విజయం నమోదు చేసుకుంది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ను మట్టికరిపించింది.

రాయల్స్ విసిరిన 155 పరుగుల విజయలక్ష్యాన్ని బెంగళూరు జట్టు కేవలం 2 వికెట్లు కోల్పోయి మరో 5 బంతులు మిగిలుండగానే ఛేదించింది. యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ మరోసారి తన ట్రేడ్ మార్కు ఇన్నింగ్స్ తో అలరించాడు. ఈ ఎడంచేతివాటం ఆటగాడు 45 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 63 పరుగులు సాధించాడు. ఆరోన్ ఫించ్ (8) విఫలమైనా కెప్టెన్ కోహ్లీ ఎంతో సంయమనంతో ఆడి జట్టుకు విజయం అందించాడు. ఏబీ డివిల్లీర్స్ 12 పరుగులతో అజేయంగా మిగిలాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా అర్చర్, శ్రేయాస్ గోపాల్ కు చెరో వికెట్ లభించింది.

అంతకుముందు, రాజస్థాన్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. మహిపాల్ లొమ్రోర్ 47 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్

ఐపీఎల్ లో ఇవాళ రెండు మ్యాచ్ లు వున్న సంగతి తెలిసిందే. రెండో మ్యాచ్ కు షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. ఈ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మైదానం చిన్నది కావడంతో సిక్సర్ల మోత మోగుతోంది. ఎంత స్కోరు కొట్టినా, ఇక్కడ ఛేజింగ్ ఈజీనే అని జట్లు భావిస్తున్నాయి. అందుకే కోల్ కతా కూడా టాస్ గెలిచి లక్ష్యఛేదనకే మొగ్గు చూపింది.
Virat Kohli
Royal Challengers Banglore
Rajasthan Royals
IPL 2020

More Telugu News