Anand Mahindra: బీఆర్ఓకు భారతరత్న ఇవ్వొచ్చు: ఆనంద్ మహీంద్రా

Anand Mahindra opines Bharataratna to Border Roads Organization
  • హిమాచల్ ప్రదేశ్ లో అతి పెద్ద సొరంగ నిర్మాణం
  • సొరంగాన్ని నిర్మించిన బీఆర్ఓ
  • బీఆర్ఓను అభినందనల్లో ముంచెత్తిన ఆనంద్ మహీంద్రా
ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు ఎంతో అర్థవంతంగా, ఆలోచింపచేసే విధంగా ఉంటాయి. తాజాగా ఆయన సరిహద్దుల్లో రోడ్డు నిర్మాణాలు చేపట్టే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ)ను అభినందనల్లో ముంచెత్తారు. వ్యక్తులకు మాత్రమే ఇస్తూ వస్తున్న భారతరత్న పురస్కారాన్ని సంస్థలకు కూడా ఇచ్చేట్టయితే బీఆర్ఓకు కూడా భారతరత్న ఇవ్వాలని తెలిపారు.

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లో ఓ సొరంగ మార్గం నిర్మించింది. సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో 9.2 కిలోమీటర్ల పొడవున్న ఈ టన్నెల్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగమార్గం. అటల్ టన్నెల్ పేరిట నామకరణం చేసిన ఈ సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో బీఆర్ఓపై ప్రశంసల వర్షం కురిపించారు. సవాళ్లు విసిరే అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ ఎంతో సమర్థవంతంగా సొరంగాన్ని నిర్మించిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కు భారతరత్న ఇవ్వాలని పేర్కొన్నారు. అయితే సంస్థలకు భారతరత్న ఇస్తారో లేదో తనకు తెలియదని, కానీ ఎంతో తెగువ, కష్టించే స్వభావంతో పనిచేసే బీఆర్ఓ మాత్రం అందుకు అన్నివిధాలా అర్హమైనదని ఆయన అభిప్రాయపడ్డారు.
Anand Mahindra
Border Roads Organization
Atal Tunnel
Narendra Modi
Himachal Pradesh

More Telugu News