Smriti Irani: రాహుల్ గాంధీపై విమర్శలు చేసిన స్మృతి ఇరానీ కారును అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు

Rahul visit to Hathras is  for politis not for justice says Smriti Irani
  • రాజకీయాల కోసమే రాహుల్ హత్రాస్ కు వెళ్తున్నారన్న స్మృతి
  • కాంగ్రెస్ వ్యూహాలు అందరికీ తెలుసని వ్యాఖ్య
  • వారణాసిలో స్మృతిని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. గ్యాంగ్ రేప్, మర్డర్ కు గురైన 20 ఏళ్ల యువతి గ్రామమైన హత్రాస్ (యూపీ)కు వెళ్లేందుకు రాహుల్ ఈరోజు మరోసారి ప్రయత్నించారు. నిన్న పోలీసులు అడ్డుకోగా రాహుల్ కిందపడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు మరోసారి తన ప్రయత్నం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో స్మృతి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు, కుట్రలు ప్రజలందరికీ తెలుసని అన్నారు. అందువల్లే 2019 ఎన్నికల్లో బీజేపీకి చారిత్రాత్మక విజయాన్ని జనాలు కట్టబెట్టారని చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో ఒక నాయకుడిని మనం ఆపలేమని... కానీ, హత్రాస్ కు కేవలం రాజకీయాల కోసమే ఆయన వెళ్లాలనుకుంటున్నారని, బాధిత కుటుంబానికి న్యాయం కోసం కాదనే విషయం ప్రజలందరికీ తెలుసని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి. వారణాసిలో స్మృతి ప్రయాణిస్తున్న కారును కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. 'స్మృతి గో బ్యాక్' అంటూ నినాదాలు చేశాయి.

మరోవైపు ఈ ఉదయం రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ఈ ప్రపంచంలోని ఏ శక్తి కూడా హత్రాస్ కు వెళ్లకుండా తనను అడ్డుకోలేదని అన్నారు. బాధిత కుటుంబం బాధను పంచుకోకుండా తనను ఎవరూ ఆపలేరని చెప్పారు. ఇంకోవైపు రాహుల్, ప్రియాంకాగాంధీ ఇద్దరూ కాసేపట్లో బాధిత కుటుంబాన్ని కలిసే అవకాశం ఉంది.

మరోవైపు హత్రాస్ గ్రామ సరిహద్దులను 48 గంటల తర్వాత ఈ ఉదయం తెరిచారు. ఈ సందర్భంగా ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ, కేవలం మీడియాను మాత్రమే గ్రామంలోకి అనుమతిస్తామని చెప్పారు. రాజకీయ నాయకులకు అనుమతి లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో, ఏం జరగబోతోందో వేచి చూడాలి.
Smriti Irani
BJP
Rahul Gandhi
Congress
Hathras

More Telugu News