bank: మారటోరియం సమయంలో విధించిన వడ్డీపై వడ్డీని మాఫీ చేస్తాం: సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

  • వడ్డీపై వడ్డీ గురించి సుప్రీంకోర్టులో తాజాగా విచారణ 
  • అఫిడవిట్ సమర్పించిన కేంద్ర ప్రభుత్వం
  • మార్చి, ఆగస్టు మధ్యకాలంలో వాయిదాలు చెల్లించిన వారికీ లబ్ధి
waive interest on interest

కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా తలెత్తిన సంక్షోభం వల్ల బ్యాంకు రుణాలపై ఆరు నెలల పాటు మారిటోరియం విధించిన విషయం తెలిసిందే. అయితే, ఆ కాలంలోనూ వడ్డీపై వడ్డీ ఉండడంతో దాన్ని మాఫీ చేయాలని వచ్చిన పిటిషన్‌లను సుప్రీంకోర్టు విచారిస్తోంది.

ఈ సందర్భంగా తాజాగా కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.  వడ్డీపై వడ్డీని మాఫీ చేయాలని నిర్ణయం తీసుకుని ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపింది. మార్చి, ఆగస్టు మధ్యకాలంలో వాయిదాలు చెల్లించిన వారికి సైతం ఈ లబ్ధి అందనుంది.  వడ్డీపై వడ్డీని మాఫీ చేయడం వల్ల ప్రజలపై పడే భారాన్ని భరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపింది.

తాము తీసుకున్న నిర్ణయం వల్ల రూ.2 కోట్ల వరకు ఎంఎస్ఎంఈ, వ్యక్తిగత రుణాలతో పాటు విద్య, గృహ, వినియోగదారుల రుణాలు, క్రెడిట్ కార్డ్ బకాయిలు, ఆటో రుణాలు వంటి అన్నింటిపై వడ్డీపై వడ్డీ మాఫీ అవుతుందని స్పష్టం చేసింది.

కాగా, మారటోరియం విధించినప్పటికీ పలు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఈ మొత్తానికి వడ్డీ వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో రుణాలు తీసుకున్న వారిపై అధిక మొత్తంలో భారం పడుతోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం రుణగ్రహీతలకు ఉపశమనం కలిగించేలా ఉంది.

More Telugu News