SRH: టాస్ గెలిచిన సన్ రైజర్స్... రాయుడు, బ్రావో రాకతో బలంగా కనిపిస్తున్న సూపర్ కింగ్స్

Sunrisers Hyderabad has won the toss against Chennai Superkings
  • దుబాయ్ లో నేడు సన్ రైజర్స్ వర్సెస్ సూపర్ కింగ్స్
  • బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
  • గాయం నుంచి కోలుకున్న రాయుడు
ఐపీఎల్ లో నేడు మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ సారథి డేవిడ్ వార్నర్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం సన్ రైజర్స్ జట్టులో పెద్దగా మార్పులేవీ లేవు.

అయితే, బ్యాటింగ్ భారం ప్రధానంగా విదేశీ ఆటగాళ్లపైనే ఉంది. కెప్టెన్ వార్నర్, ఓపెనర్ జానీ బెయిర్ స్టో, కేన్ విలియమ్సన్ ఏమేరకు రాణిస్తారన్న దానిపైనే సన్ రైజర్స్ భారీ స్కోరు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లు విఫలమవుతుండడం సన్ రైజర్స్ శిబిరాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. గత మ్యాచ్ లో బౌలింగ్ విభాగం రాణించడం ఊరట కలిగించే అంశం.

ఇక, చెన్నై సూపర్ కింగ్స్ విషయానికొస్తే పాయింట్ల పట్టికలో చివరన నిలిచింది. ధోనీ నాయకత్వంలోని ఆ జట్టు 3 మ్యాచ్ లు ఆడి ఒక్క మ్యాచ్ లో గెలిచి రెండింట ఓటమిపాలైంది. అయితే, కీలక ఆటగాళ్లయిన అంబటి రాయుడు గాయం నుంచి కోలుకుని జట్టులోకి రావడంతో సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ కు సమతూకం వచ్చింది.

అటు, సీనియర్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో కూడా రావడంతో జట్టు ప్రణాళికల్లో మరింత పదును పెరగనుంది. బ్రావో బ్యాటింగ్, బౌలింగ్ ల్లో జట్టుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాడని గతంలో అనేకసార్లు రుజువైంది. వీరిద్దరి చేరికతో చెన్నై జట్టు బలంగా కనిపిస్తోంది. కెప్టెన్ ధోనీ బౌలింగ్ లో లుంగీ ఎంగిడీ స్థానంలో శార్దూల్ ఠాకూర్ పై నమ్మకం ఉంచాడు.
SRH
Toss
CSK
Dubai
IPL 2020

More Telugu News