R Green: కేవలం రెండు గంటల్లో కరోనా టెస్టు ఫలితం.. కిట్ ను అభివృద్ధి చేసిన రిలయన్స్

  • ఆర్టీ పీసీఆర్ విధానంలో ఫలితం వచ్చేందుకు 24 గంటలు
  • ఆర్-గ్రీన్ కిట్ పేరిట కొత్త కిట్ తీసుకువచ్చిన రిలయన్స్
  • ఐసీఎంఆర్ సంతృప్తి వ్యక్తం చేసిందంటున్న రిలయన్స్ వర్గాలు
Reliance life sciences develops RT PCR Kit

ఇప్పటివరకు కరోనా మహమ్మారి వైరస్ ను అత్యంత కచ్చితత్వంతో నిర్ధారించే వైద్య పరీక్ష ఆర్టీ పీసీఆర్ మాత్రమే. ఈ పరీక్షలో ఫలితం రావాలంటే సాధారణంగా ఒకరోజు సమయం పడుతుంది. తక్కువ  సమయంలో ఫలితం పొందేందుకు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ విధానాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నా, ఇందులో కొన్ని లోపాలు ఉన్నట్టు వెల్లడైంది. అందుకే ఆలస్యం అయినా ఎక్కువమంది ఆర్టీ పీసీఆర్ టెస్టు వైపు మొగ్గుచూపుతున్నారు.

అయితే ఈ సమయాన్ని గణనీయంగా తగ్గించే ఓ సరికొత్త కరోనా టెస్టింగ్ కిట్ ను రిలయన్స్ సంస్థకు చెందిన రిలయన్స్ లైఫ్ సైన్సెస్ అభివృద్ధి చేసింది. ఇది కూడా ఆర్టీ పీసీఆర్ విధానంలో ఫలితాన్నిచ్చే కిట్. దీని ద్వారా కేవలం 2 గంటల వ్యవధిలో ఫలితం తెలిసిపోతుందని రిలయన్స్ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ కిట్ కు ఆర్-గ్రీన్ కిట్ గా నామకరణం చేశారు. ఈ ఆర్-గ్రీన్ కిట్ ను పరిశీలన కోసం ఐసీఎంఆర్ కు పంపగా, అక్కడి అధికారులు ఆ కిట్ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్టు రిలయన్స్ వెల్లడించింది. అయితే, ఈ కిట్ కు ఐసీఎంఆర్ ఇంకా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు.

More Telugu News