భారత్ లో టెస్లా ఎంట్రీపై స్పందించిన ఎలాన్ మస్క్

02-10-2020 Fri 16:32
  • విద్యుత్ ఆధారిత కార్ల తయారీలో పేరుపొందిన టెస్లా
  • భారత్ లో ఎంట్రీ ఎప్పుడన్న నెటిజన్లు
  • వచ్చే ఏడాది ఖాయంగా వస్తామన్న ఎలాన్ మస్క్
Elon Musk clarifies over Indian entry of Tesla
విద్యుత్ ఆధారిత వాహనాల తయారీ సంస్థ టెస్లా భారత్ లో ఎప్పుడు ప్రవేశిస్తుందన్న ప్రశ్నకు ఆ సంస్థ సీఈవో ఎలాన్ మస్క్ స్పందించారు. విద్యుత్ ను ఇంధనంగా స్వీకరించి రోడ్లపై పరుగులు తీసే హైబ్రిడ్ వాహనాల తయారీలో పేరుగాంచిన టెస్లా విదేశీ మార్కెట్లపైనా కన్నేస్తోంది. అయితే భారత్ వంటి పెద్ద మార్కెట్లోకి ఎప్పుడు ప్రవేశిస్తారంటూ టెస్లా క్లబ్ ఇండియా ఔత్సాహికులు సోషల్ మీడియా ద్వారా ఎలాన్ మస్క్ ను ప్రశ్నించారు. అందుకు ఎలాన్ మస్క్ స్పందిస్తూ, వచ్చే ఏడాది తప్పకుండా భారత్ లో ప్రవేశిస్తామని స్పష్టం చేశారు. ఇన్నాళ్లు తమ కోసం వేచిచూస్తున్నందుకు కృతజ్ఞతలు అంటూ ఆయన ట్వీట్ చేశారు.

పర్యావరణ హిత ఇంధనాలపై పరిశోధనలు చేస్తూ కొత్త వాహనాలు అభివృద్ధి చేస్తున్న టెస్లా ఇప్పటివరకు మోడల్ ఎస్, మోడల్ 3, మోడల్ ఎక్స్, మోడల్ వై, రోడ్ స్టర్, సైబర్ ట్రక్ వంటి ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకువచ్చింది. టెస్లా గతేడాది 3.67 లక్షల కార్లను విక్రయించి హైబ్రిడ్ వాహన రంగంలో తన పట్టు నిలుపుకుంది.